IMPERIENCE           DRKCV.ORG           SSS           

 
 

Daily Inspiration


What is new


శ్రీ రామచంద్ర రాజయోగ ప్రభావము - 20.4 - 141 L.E. (2013)

  

శ్రీ రామచంద్ర రాజయోగ ప్రభావము

శ్రీ రామచంద్ర రాజయోగ ప్రభావము అను అంశము పై పూజ్య శ్రీ కే. సీ. నారాయణ గారు లాల్ దర్వాజా శిక్షణా తరగతులలో యిచ్చిన ప్రసంగము

 

ఏ స్థితికొరకైనా, సాధనంటూ వొకటి చేయాలంటే సమయం తీసుకొంటుంది. మన దేశంలో వున్న వేరే వేరే పధ్ధతులు కనుక మనము తీసుకొన్నామంటే కొంత సమయము పడుతుంది. అంటే సమయ ప్రభావము యెంత? మన పద్ధతిలో, యిక్కడ కనీసము ఉదయం 1 గంట ధ్యానము అన్నారు, సాయంత్రము అర గంట క్షాళన అన్నారు, రాత్రి పడుకోబోయే ముందు ప్రార్థన అన్నారు.  ఇవి మాత్రము కావలసిన కనీస విషయాలు.  సాధన కొరకు మీరు అంతకు మించి యెక్కువ సమయము వృధా చేయవలసిన పనిలేదు.

మీలో యెవరైనా కానీ పారాయణం చేసివుంటే, గీతా పారాయణం చేసినా, లేక రామాయణంలో వొక స్కంధం మనం తీసుకొన్నా, మనకు సమయం పడుతుంది. ఒట్టి పూజ చేయాలి అనుకొన్నాకానీ, మనం షోడశోపచారాలతో చేసి మనం లేచేసరికి 3 గంటలు అయినా పడుతుంది. తూతూ మంత్రాలు యెప్పుడైనా చెప్పవచ్చు. దానికేముంది? అడిగే వాడు లేడు పోయేవాడు లేడు. పద్ధతి లేదు దానికి. పద్ధతి లేకుండా చేసేది ఏదైనా చేయవచ్చు.  పద్ధతి ప్రకారం చేస్తే ఇంత సమయం పడుతుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే మనము అదే పనిగా అదే పని చేస్తుండాలి. మిగతా వ్యాపారాలకి, మనం రోజువారీ  చేసే పనులన్నీ మానేయాల్సివస్తుంది లేదా దానికి తక్కువ ప్రాముఖ్యత యివ్వాలి.

ఇట్లా కాకుండా మన యొక్క సాధన ఉత్తమముగా ఉండడానికి కోరిన సమయము తీసుకొన్నప్పుడు యిక్కడ మనకు తేలినది రోజుకు వొకటిన్నర గంటలు. ఉదయం 1 గంట, సాయంత్రము అర గంట. ఆ విధముగా. ఇది సమయము యెక్కువగా తీసుకోని సమర్దవంతమైన పద్ధతి. మనకు లభించే ప్రయోజనమును బట్టి వుంటుంది. దీనికి కొద్దిసమయమే పెట్టావు.  కానీ ఏమి వస్తుంది నాకు? అన్న ప్రశ్న వేసుకొన్నప్పుడు యిప్పుడు హఠయోగం తీసుకొన్నామనుకోండి దాని యొక్క లక్ష్యమేమిటి? ఆరోగ్యము. మోక్ష సాధన గూర్చి హఠయోగంలో యెవ్వడూ మాట్లాడడు. ఆరోగ్యము. ఆరోగ్యము ఎందుకు బాగుండాల? సాధన చేయడానికి ఆరోగ్యము బాగుండాలి. అందువల్ల ప్రతి వొక్క రాజయోగి కూడా, యింతకు ముందు హఠయోగిగా వుండేవాడు. శరీరమును వొక అనువైన స్థితికి తీసుకొని వచ్చి, ఆ తర్వాత మనస్సును తీసుకువద్దామన్న ఉద్దేశ్యముతో, దానిని దీనిని కలిపి పెట్టుకొన్నారు. అంటే హఠయోగం మరియు రాజయోగం కలిపితే వాడు యోగి అవుతాడని. ఈ పద్ధతిలో బాబూజీ గారు ఏమి చేసారంటే, హఠయోగం భాగాన్ని తీసేసారు. ఒట్టి రాజయోగం పైననే మనం పోతున్నాము. దానివల్ల సమయం వొకటి పొదుపవుతుంది. అనవసరమైన శ్రమ తప్పుతుంది.

సమర్ధత అంటే శ్రమను తగ్గించుకొనుట. శ్రమని పూర్తిగా వినియోగించు కొనుట. మనకు సగము శక్తితో పని చేసే సామర్ధ్యము వున్నప్పుడు, 5 ఇంతల శక్తిని పెట్టవలసిన అవసరము లేదు. మీకు కావలసినది ఏమిటి అనే లక్ష్య శుద్ది వుండాలి.  మనకు కావలసినది, హఠయోగం మాదిరి, ప్రాణాయామం చేసేసి శ్వాసనియంత్రణ చేస్తాను, గాల్లో యెగురుతాను, నీట్లో నడుస్తాను అని కనుక పెట్టుకొంటే, అది గానీ మన గమ్యం అయితే, సరే అది చేద్దాము. మనకు కావలసినది అది కాదు. ఒక ఉత్తమ మానవుడిగా వుండడం అనేది మన సాధన యొక్క పరమలక్ష్యము. లక్ష్యము ఏమిటంటే ఉత్తమ మానవుడిగా వుండాలి. ఉత్తమ మానవుడు అనేవాడు స్వార్థపరుడుగా వుండకూడదు. స్వార్థపరత్వం మానితేనే వాడు ఉత్తమ మానవగతికి వచ్చినట్టు, వాడు మనీషి.

మానవులందరూకూడా, రెండు కాళ్ళు వున్న జంతువులంతా కూడా మానవుల కింద లెక్క పెట్టుకొంటే, మనీషి అన్నవాడు మనకు కావాలి. కవిః మనీషిః పరిభూః స్వయంభూః అని మన యొక్క వేదం ఉవాచ. వేదంలో మనీషిగా ఉండాలంటాడు. మనము నిజమైన మనిషిలా ఉండాలి.  బాబూజీగారి మాటలలో చెప్పాలంటే సత్ తత్వ ప్రాప్తి పొందుట అనగా నిజమైన మనిషిగా కావడము.  మన సాధన గమ్యం యిది. నిజమైన మనిషి అనే వాడు యెట్లా వుండాలి? ఏ పని చేసినా అందులో పరిపూర్ణత వుండాలి. యోగః కర్మశు కౌశలం. మనం ఏ పని చేస్తున్నామో, మనకు యెటువంటి పని యిచ్చినాకానీ, ఆ పని నిర్వర్తించుటలో మనం పూర్తి సమర్ధతను చూపించిన రోజు మనం యోగి అని చెప్పుకొనడానికి అర్హులము. కాకపోతే యోగి అని చెప్పుకోలేము. కనుక గమ్యము  ఏమిటయింది మనకు? హఠయోగంలో అయితే శరీర ఆరోగ్యము బాగుండాలి అని అంటాడు. ఇంకోడయితే గాల్లో యెగురుతానంటాడు. వాడిష్టం యెగరమని చెబుదాం. ఎందుకంటే యిప్పుడు మనకు విమానములుండగా మనం యెగురవలసిన పని మనకు కనపడడంలేదు. నీటి పైన కూడా ఓడలుండగా మనం నడవలసిన పని కనపడడం లేదు. అది ఏమిటంటే మనయొక్క గొప్పతనాన్ని మనం నిరూపించుకోవడానికి చేసే ప్రయత్నమే కానీ, మానవుడిగా వుండడానికి దానికి సంబంధం లేదు. ఒక బాతు గా అయిపోవడమనేది నీటిపైన నడవడం. ఒక పక్షిగా అయిపోవడమనేది గాల్లో యెగరడం. ఈ రెండూ కూడా మానవుడికంటే కూడా చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయి. కాస్తంత వివేకము ఉపయోగిస్తే దాని వెనుక వున్న అర్థం యెవరికైనా అర్థమవుతుంది.

అందువలన మన యొక్క గమ్యమేమిటి? అని తీసుకొన్నప్పుడు, వొక ఉత్తమ మానవుడిగా వుండాలి.  యెటువంటివాడు ఉత్తమ మానవుడు? ఆ సోదరుడు చెప్పినట్టు మనం ఉత్తమ మానవుడు అయినపుడు వీడెట్లయినాడా అని ఆలోచిస్తుంటారు.

ఓ సాధన పరంగా చేస్తుంటాడు. దైవ నమ్మికతో వున్నాడు. పరమార్థం తెలిసినవాడు. పరం తెలిసినవాడు. మనం కూడా అలా చేద్దాము’’ అని యితరులకు ఉత్సాహం కలుగుతుంది. ఒక ఉత్తమ మానవుడే యితరులను కూడా ఆ గతికి తీసుకురాగలుగు తాడు. ఇది మనకు నచ్చదు. మానసిక స్వభావానికి నచ్చదు. ఒక ఉత్తమ మానవుడు కనపడినా, ‘ఆయనకు చెల్లిందండీ మాకు చెల్లదు యివంతా’ అంటాం మనము. ఒక బాబూజీని చూపించారనుకో, లేక వొక వివేకానందను చూపించారనుకో, లేక వొక  రమణమహర్షిని చూపించారనుకో, వొక అరబిందోను చూపించారనుకో యెటువంటి గొప్ప మహనీయుడిని తీసుకొన్నా ‘వాళ్ళకు చెల్లిందబ్బా యిది మనకు చెల్లదు’ అని అంటాం. ఎందుకంటున్నాము ఆ మాట? వాళ్ళంతా సమయము, కాలాన్ని, వాళ్ళ జీవితాన్నంతా కూడా ధారపోసారు. అటువంటి వాళ్ళు ఇంతకుముందూ మనకు కనపడ్డారు. సాధారణంగా గృహస్థుడుగా వుంటూ ఉత్తమగతి పొందినవాడు మన సమీపంలో మనకు కనపడ లేదు వొక బాబూజీ తప్పితే.  సంసారంలో వుంటూ, పిల్లల్ని పెంచుతూ, పెద్దవాళ్ళ పని చేస్తూ, కోర్టుకు పోతూ, కోర్టునుంచివస్తూ, వ్యవహారలన్నీ చూస్తూ కూడా వొక మనీషిగా బతికిన మనిషి ఈయన వొక్కడే మనకు కనపడ్డాడు యిప్పుడు యిటీవల కాలంలో. పాతకాలం కథలు చాలా వుంటాయి. మనక్కాదు.  అంటే ఏమిటి? మనం వొక స్థితికి వచ్చేసాం. ఒక గాంధీజీ గారిని తీసుకొన్నామనుకో, అతను నిజంగా సంసారిగా వున్నాడు. సొంత సంసారం మానేసినా సాంఘిక సంసారంలో తిరుగుతూ సంఘానికి సేవ చేస్తూ, వొక ఉత్తమ మానవుడిగా వుంటూ, సన్యాస ఆశ్రమం తీసుకోలేదు కదా ఆయన. ఆయనొక గొప్ప మనిషి మనకు. అందుకనే ఏమి చేసాం గాంధీగారికి విగ్రహములు కట్టిపెట్టాం మనం. దానివెనుక, అటువంటి నడవడిక మనం పెంచుకోదలచుకోలేదు. ఆయన చేసిందాంట్లో యేమి చేసాడు? సత్య వాక్ పరిపాలన చేసాడు. నిన్న నేను మాట్లాడుతూ మీకు సత్యము, అహింస, ఆస్తేయము, అపరిగ్రహము, బ్రహ్మచర్యము అనునవి మానవులు చేయవలసిన ధర్మము ఇవ్వన్నీ పాటించాలని చెప్పాను. ఏ వొక్కటి పాటించినా అంత మహాత్ముడు అవుతాడు. అన్నీ పాటించిననాడు మీరేమౌతారో మీరే ఆలోచించుకోవచ్చు. ఆలోచన సాధ్యమా? ఇటువంటి ఆలోచన మాకు సాధ్యమా? ఇటువంటి ప్రవర్తన మాకు సాధ్యమా అంటే, మనకు సాధ్యము కానిది ఏమియును లేదు. భగవంతుడే మనముగా వున్నాము కాబట్టి, భగవంతుడే మన రూపము ధరించాడు కాబట్టి, భగవంతుడికి యిటువంటిది వీలుకాదు అని చెప్పలేము కాబట్టి, తప్పకుండా మీకు వీలవుతుంది. కానీ వీలుపడదని యెవరు చెప్పినారు మనకు? ఇది యెవరు చెప్పారు? మనకు తెలిసిన వేదాంతులు చెప్పారు. ‘ఇది నీకు గృహస్థాశ్రమంలో వీలుపడదులేవయ్యా’ అని సన్యాసులు చెప్పారు. అది నిజమని నమ్మాము. కాలక్రమేణ జరిగిన విపరీతమైన ఆలోచన యిది. మనకు అటువంటి సామర్ధ్యము వుంది అనే ధృఢ సంకల్పము, ధృఢ నిశ్చయము మనకు కలుగుతుంది. ఇది సాధనలో చాలా గొప్ప మార్పు. ఇతర సాధనలు చేసేవాడికి, ఈ సాధన చేసేవాడికి మౌలిక తేడా యిది. నాకు చేతనవును అని కూర్చుంటాడు ఈయన. నాకు చేతకాదని పోయి కాళ్ళమీద పడతాను అంటాడు ఇంకోడు. వాళ్ళు  భక్తులు.  యోగులకు, భక్తులకు తేడా ఉంది. నాకు చేతకాదు, నా వల్ల కాదు, నీవే నా తరఫున కూడా చేసేసెయ్యి. ఇది సాధారణంగా మనము చూస్తే, మనకు అయ్యవారు చెప్పే మంత్రాలు రావు కాబట్టి, నువ్వు చెప్పు నాయనా మంత్రాలు అని వాళ్ళకి వదిలేస్తాం. అదే అన్నమాట యిక్కడా జరిగేది. సాధనలో కూడా అదే. మీ ఆలోచనలు చెబుతున్నాను. ఎటువంటి సమానాంతరములు మనకు కనపడతాయి. ఈ నమ్మకము, మనలో మనకు నమ్మకము, ఆత్మ విశ్వాసము కలుగ చేస్తుంది. ఈ పద్ధతిలో మీకు వస్తుంది.  ఇతర విధానములలో యిటువంటి ఆత్మ విశ్వాసము గూర్చి మాటలే లేవు. అటువంటి దాని గూర్చి అక్కడ మాటలే లేవు.  ఆత్మ విశ్వాసము  వచ్చిన తర్వాత, ప్రాణాహుతిని మనము అనుభవిస్తుంటాము కాబట్టి గురువుగారి యొక్క సామర్ధ్యము కూడా మనకు తెలియవస్తుంది. ఏం సామర్ధ్యము? మనముందు ఆయనేమైనా అద్భుతమైన విన్యాసాలు చేస్తారా?  మాయలు/మంత్రాలు చేస్తారా? చేయరు. అవి చేయవలసిన అవసరం లేదు. అవి చేసినా మనకు పనికి రావు. అది ఆయన గొప్పతనము అని తెలుసు. మనకు యెప్పుడు భగవంతుడు పనికి వస్తాడు? ఒకప్పుడు మా బావ గారు ఏమన్నాడంటే, ‘రావయ్యా, వొక మహనీయుడి దగ్గరికి పోతాము’ అన్నాడు. ‘పోదాంలే దానికేముంది ఆయనేం చేస్తాడు చెప్పు’ అన్నాను. ‘ఆయన చాలా గొప్పవాడు నీకు తెలీదు’ అన్నాడు. ‘సర్లే చెబుతున్నావు కదా గొప్పవాడని, గొప్పవాడే!  నాకేమి చేస్తాడు చెప్పు’ అన్నా. ‘నీకేం చేస్తాడంటావేంటిరా వెధవా, పెద్దవాడు కదా! పోవాలికదా!’ అన్నాడు. ‘నిజమేనయ్యా, పెద్దవాడు వొప్పుకొన్నాం, భగవంతుడే అని వొప్పుకొంటాం అనుకో, ఏమి చేస్తాడు నాకు చెప్పు’ అన్నా. ఆ స్థితికి నన్నేమైనా తీసుకు వస్తాడా! నన్నేమైనా భగవంతుడికి సమానంగా చేస్తాడా, నాకేమి యిస్తాడు ఆయన. నేను చేసుకోలేనిది, ఆయన చేసేది ఏమిటి? ఉద్యోగమా చేస్తున్నాము. బట్టలు నేను కొనుక్కుంటా, తిండి నేను చేసుకొంటున్నా. తిరగాలంటే తిరుగుతున్నా. ఆయనేం చేస్తాడు? నాకేమి చేస్తాడు? ఎందుకు యిటువంటి వెధవ ప్రశ్న వేసారు అని మీరు అనుకోవచ్చు. కానీ నిజంగా నాది వెధవ ప్రశ్న కాదు, చాలా అవసరమైన ప్రశ్న. భగవంతుడు నాకు కనపడితే నాకు వచ్చే లాభమేమిటి? చెప్పండి. మీకు యెవరికైనా భగవంతుడు కనపడ్డాడనుకో ఏం లాభం చెప్పండి? ఎవరైనా చెప్పగలుగుతారా? భగవంతుడితో మనకు కావలసినది అతన్ని చూడడం కాదయ్యా, ఆయనతో తాదాత్మ్యం పొందాలి, ఆయనతో వొకటిగా కావాలి. నీ తోనే వుంటున్నానయ్యా, నాతో తాదాత్మ్యం చెందు అంటాడు ఆయన.  దీన్ని మానేసి మనం బయట దేవుడ్ని వెతుక్కుంటాం. అంటే మొదటిది మూర్ఖత్వం. రెండోది, యెప్పుడైతే మన స్నేహితుడు లోపల వుంటాడో, అంటే భగవంతుడు లోపల వుంటాడో, అతన్ని సాన్నిధ్యములో పెట్టుకొని, ఆయన్ని మనసులో వుంచుకొని, మనం పని చేసినపుడు మన యొక్క పని సంపూర్ణముగా వుంటుంది. కర్మశు కౌశలం యెప్పుడు వస్తుంది అంటే, యోగమైతేనే కానీ రాదు. వీళ్ళేమనుకొన్నారు? యోగః కర్మశు కౌశలం అన్నప్పుడు, వీడు సమర్ధముగా పని చేస్తే, వీడు భగవంతుని దగ్గరికి పోతాడని. అట్లా కాదు.  భగవంతుడు మనతో వుంటేనే, మనకు సామర్ధ్యము వస్తుంది. మనతో నిరంతరం ఆయన ఉన్నాడు అనే జ్ఞానం వుంటేనే మనకు సామర్ధ్యము వస్తుంది. అర్జునుడి గురించి ఏ మాత్రం తెలిసివున్నా, అర్జునుడు ముందు యెప్పుడూ రథసారథిగా, ఆయన పార్థసారథిగా వుంటున్నాడు కాబట్టి, ఆ భగవంతుని సమీపంలో, భగవంతుడి సాన్నిధ్యంలో భగవంతుడి పైన నిరంతర చింతన చేస్తూ పని చేసాడు, బాణం వేయకుండా ఉరుకోలేదు కదా! నిరంతర ధ్యాస ఆయన పైన ఉందనేసేసి, అక్కడ కూర్చుండి పోయి భజన చేయట్లేదు కదా. పార్ధుడు ఆ పని చేయలేదు. పార్థుడు తన కర్తవ్యం చేసాడు యుధ్ధం చేసాడు.

యుద్ధానికి ముందు అర్జునుడు, బంధనములతో వుండి, వొక విచిత్రమైన స్థితిలో పడ్డాడు. ఈ పని ఏదో చేయమంటున్నారు, నా యొక్క బంధువులున్నారు. మరి నాకు యిలా వుంది, నేనేమి చేయాల? నాకు విషాదంగా ఉంది అని అంటాడు. వివేకం తెచ్చుకోరా నాయనా అంటాడు ఆయన. నీవు యెవడు చేసేది దానికి, చేసేది నేను. ధర్మ సంస్థాపనార్థం వచ్చాను నేను. దుష్టులను మనం తీసేయ్యాలి. మనం పని చేయాలి. పని చెయ్యి. ఎవడైతే నీకేం కావాలి? ఈ జన్మలో వాళ్ళు నీకు మామలు, తల్లులు, తండ్రులవుతారు. నిరంతరం ప్రవహించే కాలవాహినిలో వాళ్ళెవరు? నీవెవరు? అంతాకూడా భగవత్ స్వరూపులే కదా! చూడు! చూడు నా యొక్క దర్శనం చేసుకో. తెలుస్తుంది నీకు అన్నాడు. అటువంటి వాడు ముందు వుండగా, ముందు బండి తోలుతుండగా యితను యుధ్ధం చేసాడు. పార్ధుడికి ఆయన పాపం అలా కనిపించి చెప్పవలసినటువంటి అవసరం పడ్డది. ఎందుకంటే అతని యొక్క అజ్ఞాన స్థితి అటువంటిది. అంటే అన్ని సంవత్సరములు సఖుడిగా లేడా? సఖుడిగానే వున్నాడు. మిత్రుడిగా లేడా? మిత్రుడుగానే వున్నాడు. అయినా ఆ విచక్షణా, వివేకము రాదు.  దీనిలో మనము తెలుసుకోవలసినది ఏమిటంటే నిరంతరము మనతో కూడా మన భగవంతుడు మనలోపలనే వున్నా కానీ అర్జునుడు యెలాగ కృష్ణుడిని విస్మరించి, తనే చేస్తున్నాడు అనే వొక అహంకారంతో విర్రవీగి, విషాదంలో పడ్డాడో, అలాగే మనము కూడా విషాదంలో పడుతూవుంటాము. ఎప్పుడైతే ఆ ధ్యాస, లోపల మన హృదయంలో భగవంతుడు వున్నాడు అనే వొక జ్ఞానం, నీకు యెరుకకు వస్తుందో, అప్పుడు నీకు నిశ్చలస్థితి వస్తుంది.  అది యెరుకకు యెట్లా వస్తుంది? ప్రాణాహుతి ద్వారా మనం అనుభవించే ఆ వొక నిశ్చలస్థితి, భగవద్భావన వలన కలిగిన నిశ్చలస్థితి, భగవంతుడు మనలో ప్రవహించేటప్పుడు భగవద్భావన ప్రవహిస్తుంది. ఆ భగవద్భావన ప్రవహించినపుడు నీకు నిశ్చలస్థితి వస్తుంది. పూర్తిగా ఆలోచనారహిత స్థితి రాకపోయినా మనం ఏదో వొక తన్మయ స్థితిలో వున్నాము. ఒక నిమగ్న స్థితిలో వున్నాము. భగవంతుడి వైపు మన మనస్సు మరలిందని చెప్పే జ్ఞానం యెప్పుడైతే కలుగుతుందో అప్పుడు నీ యొక్క ఆత్మ విశ్వాసానికి తోడ్పాటుగా, భగవంతుని సహాయం కూడా వుందని యెరుక కలిగి, నీ యొక్క కర్మ అంతా కూడా సంపూర్ణముగా వుంటుంది.  సంప్రదాయ పద్ధతులలో వాళ్ళేమి చెబుతారు? ఎవడైతే భగవంతుడిని గాని చూసాడో, తరించాడో, తర్వాత వాడి గురించి మనకు యెక్కడా ఏ కథలో కూడా మనకు  చెప్పరు. ఏమౌతాడు వాడు? ఏమౌతాడో యెవడికీ తెలీదు. మనకు కావలసినది అటువంటి స్థితి కాదు.  మనకు కావలసినది  ఏమిటంటే, యిక్కడ వుంటూ మనం యెన్ని నాళ్ళు ఉండాలని  భగవంతుడు నిర్దేశించినాడో, అన్ని నాళ్ళు వుంటూ, భగవంతునితో వుంటూ, భగవంతుడి సాన్నిధ్యంలోనే మసలుతూ, భగవత్ కైంకర్యాన్ని మనం చేయాలి. మనకు పని అంటూ ఏం వుండదు. అన్ని పనులూ ఆయనవే. నీవు కార్యాలయములో draft man గా పని చేసినా,  electronic engineer గా పని చేసినా, ఊడ్చువానిగా పనిచేసినా, ఉపాధ్యాయుడుగా పని చేసినా, అన్నీ కూడా వొక విధమైన సేవయే.  సేవ అన్న మాట రావటంతోటే, అదంతా కూడా భగవత్ పరమే. అటువంటి సేవాభావముతో చేసే పని యెప్పుడూ కూడా మీ యొక్క కర్మానుష్టానం వల్ల యెలా అవుతుందంటే సంపూర్ణమైనదిగా వుంటుంది. అంటే నిష్చేటతనే వొక విధమైన లక్ష్యము గురించి యితరులు కొందరు చెపుతారు కాని మనము చెప్పేది ఏ రంగములో నైనా సమర్థమైన కార్యదక్షత గురించి.

నిన్న వొక పత్రికలోని వార్తలో వచ్చింది హిందూదేశంలోని  సమస్య ఏమిటంటే, వాళ్ళెవరయినా తమ గురించే పట్టించుకొంటారు కానీ యితరుల గురించి పట్టించుకోరని. వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక ఉన్నతి గురించి మాత్రమే ఆలోచిస్తారే కానీ యితరుల గురించి ఆలోచించరు అనే వొక  అపవాదు వచ్చింది.  నిజమే యిటువంటిది జరిగింది.  పోయిన శతాబ్దం కడపటిలో వివేకానంద వంటి మహనీయులు మాట్లాడుతున్నప్పుడు, వేదాంతానికి బహు ప్రాముఖ్యము యిచ్చారు. కానీ వేదాంతంలో చెప్పినట్టు మన హిందువులు యెవడూ కూడా నడవట్లేదు. ఈ దేశంలో హిందువైనా కానీ, యెవడైన కానీ, ఏ మతమైనా కానీ, పుస్తకాల ప్రకారం ప్రవర్తించేవాడు లేడు. భగవంతుడు ఉన్నాడన్న నమ్మకంతోనే చేస్తాడే కానీ, పుస్తకాల్లో చెప్పారు, యిట్లాచెప్పారు, అట్లా చెప్పారు అని చేసేవాడు లేడు. వద్దన్నా, కావాలన్నా రామ నామ జపం జరిగిపోతూనే వుంది. వద్దన్నా, కావాలన్నా నమాజ్ లు జరిగిపోతూనే వున్నాయి. మొన్న నాకు వొకరు కనపడ్డారు. ఒక  ముస్లీమ్ సోదరుడే ఆయన యెక్కడో ఈమధ్యనే గల్ఫ్ ప్రాంతానికి పోయివచ్చాడట. ఏమిటయ్యా అక్కడికీ యిక్కడకీ విశేషం అంటే యిక్కడ ఉన్నవాళ్ళు కనీసం భగవంతుడి గూర్చి ఆలోచిస్తాం సార్, అక్కడ ఆలోచించరు అన్నాడు. ఏమి చేస్తుంటారు నమాజులో అని అడిగితే, వాళ్ళేమి చేస్తున్నారో వాళ్ళకే తెలియాలి సార్ అన్నాడు.  మేమేదో కాస్త దేవుడి గూర్చి ఆలోచిస్తాం అన్నాడు. ఎందుకంటే దైవపరంగా మన మనస్సును మళ్ళించుకొనే బుధ్ధి ఈ దేశానికే వుంది. చేసే ప్రతి కార్యాన్ని కూడా దైవ పరంగా ఆలోచించే బుధ్ధి మనకు ఉంది. ఈ మాట యెక్కడా చెప్పలేదు ఆయన. దైవపరంగా ఆలోచిస్తూ యెవడికి వాడు యింట్లో కూర్చుని వుంటే యింత పైర్లు పండేనా, లేకపోతే యింత సమృద్ధిగా ఉండేవాళ్ళమా! ఈ రోజు మనం అనవచ్చు, వాళ్ళు అనవచ్చు మొన్నటిదాకా మీది పేద దేశము అని. రాబర్టు క్లైవ్ ఈ దేశానికి వచ్చిన మొదటి రోజుల్లో, కొలకత్తాలో దిగినప్పుడు వ్రాస్తాడు, వ్రాసిందాట్లో ఏమి చెప్తాడంటే, యిక్కడ సామాన్యుడి ఇంట్లో తిండి కూడా అక్కడ మన రాజులు, రాణులకు కూడా లేవు అంత బాగావుంటుంది యిక్కడ అని చెప్పి వ్రాశాడు. అంటే రెండు మూడు శతాబ్దాలకు ముందు మనం కానీ చూస్తే మనం సోమరిపోతులం కాము. ఏదో వేదాంతం చెప్పేసేసి నిద్రపోయేరకం కాదు. కర్మ సిధ్ధాంతాన్ని పట్టుకొని నాకెందుకని పట్టించుకోని వాళ్ళమూ కాదు. కానీ యివన్నీ మన పైన రుద్దబడ్డాయి. మనకీ వేదాంతములే ముఖ్యమని యెవరో చెప్పేసాడు. ఎవడు చెప్పాడు? ఎవడో అద్వైత వేదాంతి, వొక వేదాంతం అని చెప్పాడు. చాలా గొప్పగా వుంది. శంకరాద్వైతాన్ని విమర్శించే ఉద్దేశ్యం  నాకు లేదు. కానీ శంకర అద్వైతం మాత్రం హిందూమతం కాదు.  శంకర అద్వైతం ఈ దేశం యొక్క ఆధ్యాత్మిక స్థితిని తెలుపదు. శంకర అద్వైతం వొక పద్ధతి. చాలా బాగావుంది. మంచి విధానమే. వేదాంతము గూర్చి బాగా వ్రాసారు. తర్కము సరియైనదిగా వుంది. అంతవరకు వొప్పుకొంటారు. కానీ మన నడవడిక, మన ఇంట్లో మన అమ్మలు కానీ,  తాతలు కానీ, అమ్మమ్మలు కానీ,  నాయనమ్మలు కానీ, వాళ్ళు వాళ్ళ మతము ఏదైతే  కొనసాగింపు చేసారో,  యెట్లా జరిగితే అట్లా జరుగుతుంది అని చెప్పేసేసి, బయట కూర్చుని పొయ్యి ముట్టించకుండా, వంట చేయకుండా అయితే లేదు కదా! వంట చేసారు, వండి పెట్టారు, తిన్నాం.  వాడెవడో పోయినాడు, వాడు కష్టపడ్డాడు సంపాదించాడు, వచ్చాడు. దేశం అంటే మరీ సోమరిపోతులం అని చెప్పేసేసి వాడెవడో చెప్పేసేస్తే, మనం వొప్పుకోవాలా? ఒప్పుకొనే స్థితికి వచ్చాము మనం బానిసత్వంతో. బానిసత్వం మనకు ఆంగ్లేయులు కలిగించారు.  వాళ్ళు వచ్చి  యెడతెగకుండగా మనల్ని, నీకేమి రాదు, నీకేమి రాదు, నీకేమి లేదు అని చెప్పడంతో, నిజం కామోసు అనుకొన్నాము.  బ్రాహ్మణుడి కథలోలాగా.

ఎవడో వొక బ్రాహ్మణుడు మేకను తీసుకొని పోయినాడట. మేకను తీసుకొని పోతూవుంటే నలుగురు కలిసి ఏమిరా! కుక్కను తీసుకొని పోతున్నావు, కుక్కను తీసుకొని పోతున్నావు అంటే నిజముగా కుక్క అనుకుని, పారేసిపోయినాడట. అట్లాగా మనము కూడా వాడెవడో వరుసగా చెబుతూవుంటే, వరుసగా పత్రికలో వ్రాసినాడంటే నాకు విచిత్రంగా అనిపించింది. కర్మ సన్యాసులమా మనమేమైనా? మనకు పరిశొధనపైన కానీ బుధ్ధి లేకపోతే,  సి. వి. రామన్ అనేవాడు మనకు యిది చెప్తాడా, వాడు పరిశొధన చేస్తాడా? ఏ సౌకర్యములు లేకుండా చేసినాడు కదా! రామానుజం అనేవాడు చేస్తాడా,   గణితశాస్త్రములో చేస్తాడా? కర్మ సిధ్ధాంతం పైన రాలేదు మనము. లీలావతి గణిత శ్రాస్త్రం పైన వ్రాసిందంటే ఊర్కే వ్రాసిందా? ఆంగ్లేయుడు బీజగణితం మనకు చెప్పేదానికి ముందే మనకు తెలుసు బీజ గణితం.  వీడు చెప్పేది ఏమిటి నడు మధ్యలో? అటువంటి ఉన్నతమైన సంస్కృతి మనకేదైతే వుందో, దాన్ని వొక్క విషయంలో తీసుకొని ఏమిటి? అంతాకూడా భగవంతుడికి ఐక్యం చేసి భగవత్పరంగా మనం ఆలోచించాలని మనం చెబ్తూవుంటాం కాబట్టి, దాన్ని వొక్కదాన్ని మాత్రం తీసేసుకొని, వేరుచేసేసి, మన జీవితముల నుంచి దాన్ని వేరుపరచి మనకు చేతకాదు అన్నారు. అటువంటి పరిస్థితులలో మనము లేము. మనం ప్రతి వొక్కరూ కూడా దైవ సమానులమే, ఆ మాటకువస్తే, యితరులు యెవరయితే వారు పాపులము అనుకొంటారో, వాళ్ళకి మనంత ఆత్మవిశ్వాసము వుండే అవకాశం లేదు. పుట్టుకతోనే నేను పాపి అనుకొన్నవాడు, ఆత్మవిశ్వాసం యెట్లా పెంచుకొంటాడు? ఆత్మవిశ్వాసం మనం పెంచుకోవాలంటే మన సిధ్ధాంతం ఏమిటి? నిజమైన సిధ్ధాంతం, యిదంతా కూడా భగవంతుడు సృష్టించిన విశ్వము అని ప్రతివొక్క శాస్త్రజ్ఞుడు వొప్పుకొంటాడు కదా! ఒక క్షోభ్ నుంచి వచ్చింది ఈ ప్రపంచం అంతాకూడా. ఇది భగవంతుడి ప్రక్రియ.  దీంట్లో మనది ఏమీ లేదు. అసలు నిజమైన భగవంతుడు ఈ ప్రక్రియ కాదురా నాయనా అని మన వాళ్ళు చెప్పారు అంతే.  ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, నువ్వూ  భగవంతుడి సృష్టివే, యితడూ భగవంతుడి సృష్టినే. దాంతో మనలో మనకు వైషమ్యాలు వస్తాయని, మనకు చెట్టులకి, పుట్టలకి తేడావుందని భ్రమ పడుతారేమోనని, పక్షులు సమస్త జాతులు మనకి లొంగివుండాలనే వొక  వెధవ ఆలోచన వస్తుందని, ఏమి చెప్పారంటే అంతాకూడా భగవత్పరంగా ఆలోచించండయ్యా, అన్నిటి వెనుకా అదే భగవంతుని శక్తి వున్నది అని ఈరోజు ఏదైతే పర్యావరణము అంటున్నారో పర్యావరణ పరిరక్షణ అంటున్నారో, యిటువంటి దాని గురించి ఆలోచించి చెప్పిన మాట అది.

ప్రధానముగా యిటువంటి గమ్యానికి తీసుకుపోయే సిధ్ధాంతం కావాలనుకొన్నప్పుడు అనుకూల మార్గాచరణము కావాలి.  వ్యతిరేక మార్గాచరణము కాదు. నేనొక మూల కూర్చుని భగవంతుడ్ని యెరిగితే చాలు అనుకొన్న సిధ్ధాంతం యిది కాదు. అటువంటి దాని పైన్నే మనకు యిప్పుడు విమర్శలు అంతా వస్తున్నాయి. అన్యాయమైన విమర్శలు వస్తున్నాయి. నిజంగా మనయొక్క ధ్యేయం ఏమిటి అని అంటే అత్యుత్తముగా కార్యమును నెరవేర్చడము.  ఇతరుల మేలుకొరకు చేయు అత్యున్నత మైన కార్యము.  ప్రతి క్షణము భగవంతుడు మన వెనువెంటనే ఉంటున్నాడని, మనమందరము అర్జునుడిలా కావాలని, చూపడానికే.

మనం భగవద్గీతలో వొక్క అర్జునుడికే యిది సాధ్యమయింది, పార్థసారథి అతనికి వొక్కడికే వున్నాడు అని పేరు పెట్టాము. పార్థసారథి అని పేరు పెట్టడంతోటే, భగవంతుడు పార్థుడికి మాత్రమే సారథి, మనకు కాదని మనం భగవంతుడికి హద్దులు చేసేశాము. మనమందరం పార్థులమే. మనలో ప్రతి వొక్కడూ పార్థుడే. ఇందులో ఏ మాత్రం తేడాలేదు. అటువంటి గమ్యానికి తీసుకుపోయే పద్ధతి మనకు కావాలి అనుకొన్నప్పుడు హఠయోగమూ వీలుపడదు, పూర్తిగా రాజయోగమూ వీలుపడదు. ఇవి రెండూ కలిపి, దాన్లో, దీన్లో రెండూ కత్తిరించేసి వొక పద్ధతి యివ్వాల్సివస్తుంది. అటువంటి పద్ధతే యిది. హఠయోగంలో కావలసిన అన్ని గంటల సాధనని  వొకటిన్నర (1½) గంటలకు తగ్గించి, భక్తి యోగంలో వుండవలసిన కొన్ని కోట్ల నామాలు జపించడంకానీ, వ్రాయడంకానీ అనే దాన్ని 15 నిముషములకు కుదించి, వొక పద్ధతిని మనకిచ్చి,  ప్రాణాహుతి ద్వారా ఆధ్యాత్మిక సహాయము ఏదైతే అర్జునుడు తాను పొందాడో, దైవ సహాయం పొందాడో, అటువంటి దైవ సహాయాన్ని మనకు అందిస్తూ, ఈ యొక్క పద్ధతిని మనకివ్వడమంటూ జరిగింది. ఎందుకింత చెప్పవలసి వస్తుందంటే మన లక్ష్యశుధ్ధిపై స్పష్టత వుండాలి.

శ్రీరామచంద్ర చైతన్య శ్రవంతి మిమ్మల్ని సోమరులుగా లేక బద్ధకస్తులుగా ఉండిపోయి వొక మూలలో కూర్చుని వుండాలని కోరడం లేదు. అలా కానే కాదు.  అది శ్రీరామచంద్ర రాజయోగము యొక్క విధానము కాదు. శ్రీరామచంద్ర రాజయోగము చైతన్యవంతమై, అనుకూల విధానములతో మానవజాతి శ్రేయస్సు కొరకు, మీ అందరి మంచి కొరకు, మన అందరి మంచి కొరకు ఉన్నది.

ఇవన్నీ కూడా తీసుకు వచ్చి, పొందదగిన హద్దులు అని తెలిపి, సహాయము యివ్వబడింది కాబట్టి యిది  ప్రయోజకారియైన పద్ధతి.

నేను ఇంకొక విషయము వివరించి చెప్పాలని అనుకొంటున్నాను. నిన్న మనం సాధన చేసేటప్పుడు, వొక అబ్బాయి నాతో మాట్లాడుతూ ఏమన్నాడంటే మనం వ్రాయలేని ఆకలి, లైంగిక విషయము, దాహము; ఈమూడు విషయాలు మనకు చాల యిబ్బందిని కలుగజేస్తాయి. నాకెక్కువ నీళ్ళు కావాల, నాకు దాహం అనిపించింది అని వ్రాసుకోవడం లో కష్టం లేదు. ఎక్కువ పరిగెత్తినాను ఈ రోజు, దానివల్ల దాహం అనిపించింది. అంతవుండకూడదు, తగ్గించుకోవాలి అని బాగా వ్రాసుకొంటాము. ఆకలి వేస్తుంది అక్కడేదో పెట్టారు తీసేసుకొన్నాను, తీసుకోకూడదు అయినా తీసేసుకొన్నాను, తప్పయిపోయింది. ఇటువంటి ఆకలి అనేదానిపైన మాట్లాడుతూ తిండి గూర్చి మాట్లాడుతూ మహాత్ముడు ఏదో మేకని తిన్నాడనో, కోడిని తిన్నాడనో వ్రాసాడు, తప్పులేదు. దాని గూర్చి బాధపడి పోయాడాయన. అహింస అనే తత్వంపైన వెళ్ళి ఆయన బాధ పడ్డాడు. ఇవి వ్రాసుకోగలుగుతాము. కానీ లైంగిక విషయాలు వచ్చేసేటప్పటికి దెబ్బ తింటున్నాం మనం. ఈ రోజు వీళ్ళేదో పాశ్చాత్యులు దాని గూర్చి పూర్తిగా అవగాహన వాళ్ళకు కలిగిందని, మనకేదో అది లేదని బాధపడే వాళ్ళు చాలామంది వున్నారు. అంత దౌర్భాగ్యపు స్థితిలో మనము లేము. మన ప్రాచీన సాంప్రదాయం తీస్తే, కామసూత్రం అని వ్రాయగలిగిన దమ్ములున్న దేశమిదొక్కటే. ఇంకెవడూ వ్రాసిన వాడు లేడు. వాత్సాయనుడు కూడా అప్పుడు వ్రాసినాడంటే, ఎంత దమ్ముంటే వ్రాసుంటాడు ఈ దేశంలో చెప్పండి. అంటే యిది మానవ సహజమైనది. ప్రతి వొక్క జంతువుకీ వుంది, మనకూ వుంది. ఈ జంతుప్రవృత్తినుంచి మనం యెదగాలి. దీన్ని యెట్ల మనం ఉపయోగము చేసుకొని పైకి యెదగ గలుగుతాము అనేదానిపైన ఆ శాస్త్రము వ్రాసారాయన.  మీకర్థమైందా.  దాన్ని వాడెవడో బయటి వాడు వచ్చి చెప్పేసి, యిదంతా చెడు అని చెప్పడంతోటే, నదృశ్యంతర అన్న వెధవ ఆలోచన వచ్చి యిలా వచ్చిందనంటాం. అదే యిప్పుడు బాబూజీ గారి ఆత్మకధ ప్రధమ భాగం చూసారంటే, ఆయన నాకు ఈ రోజు కామతీవ్రత యెక్కువగా వుండెను అని వ్రాసుకొన్నాడు. వ్రాసుకొనే దమ్ములు వున్నాయి ఆయనకి. ఎందుకు? సాధకుడు కాబట్టి. నిజమైన సాధకుడు కాకపోతే వాడేం చేస్తాడు, అంటే యిటువంటివి వ్రాయడు. వాడి మొహం చూసుకోడు కదా వాడు.  చూసుకొంటే అసహ్యముగా కనపడతాడు. వాడికెవడో చెప్పాడు అసహ్యముగా వుందని, దాంట్లో అసహ్యముగా వుండవలసిన అవసరం ఏమీ లేదు. సర్వ సాధారణమైన విషయము, అందరికీ అన్వయించే విషయము. దాన్లో పొల్లు అనేది ఏమీ కనపడదు. విపరీతంగా వున్నాము అని అంటే అవును విపరీతంగా వున్నాము. ఎందువల్ల వున్నాము? మన దేశంలో వచ్చిన దౌర్భాగ్యం కాదు. బయటి వాడు వచ్చి చెప్పాడు. మీరు యెక్కడైనా, ఇంతకు ముందు పుస్తకాల్లో కానీ చూసుకొన్నారంటే, దాన్ని యెట్లా అదుపు చేసుకోవాల, యెట్ల మనం నడవడిక చేసుకోవాలి అని వివరముగా వ్రాసివుంది. కానీ ఈ స్వేచ్ఛ అనేది వొకటి మనిషికి యిచ్చాడు దేవుడు. పశువాంఛలో కూడా మనకు స్వేచ్ఛ యిచ్చాడు దేవుడు. పశువాంఛలో పశువులకి స్వేచ్ఛ యివ్వలేదు. ఏ సమయానికది జరిగిపోవలసినదే లేకపోతే దానికి పిచ్చిపడుతుంది. మనిషి అన్నవాడికి దానిలో స్వతంత్రము యిచ్చాడు. మీరు అదుపు చేసుకోండిరా అన్నాడు. అదుపు  చేసుకోరా అంటే మనకు యిప్పుడు స్వేచ్ఛ వచ్చినట్టే. స్వేచ్ఛవస్తే యెవడికి వాడు యెలా హద్దులు లేని విధముగా ప్రవర్తిస్తాడో, అట్లాగే అక్కడ కూడా ప్రవరతిస్తున్నాడు. మనకు లభించిన స్వేచ్ఛను పరోపకార ప్రవర్తనతో వినియోగించుటకు బదులుగా మనము ఏదైనా చేయుటకు యోగ్యతాపత్రము లభించినట్లు ప్రవర్తిస్తున్నాము. స్వేచ్ఛ అనగా యోగ్యతా పత్రము కాదు. మీ కర్థమయ్యిందా?

కానీ ప్రతి వొక్కడికీ మొదటిరోజునుంచీ ఈ రోజువరకు కూడా, సాధన చేసేవాడికి మొదటి రోజునుంచీ ఈ రోజు వరకు కూడా యిదే మొదటి ప్రశ్న.  ఎట్లా అదుపు చేసుకోవాల? అదుపు చేసుకోండి. తపము చేయండి. జపము చేయండి. ఉపవాసాలు వుండండి. పస్తులుండండి. సన్యాసాశ్రమం తీసుకోండి. ఇటువంటి సలహాలు యిచ్చారు. ఉచిత సలహాలు యిచ్చారు. పాటించిన వారు పాటించినారు. పాటించని వారు పాటించ లేదు. ఇవన్నీ అయ్యే పని కాదులే పొమ్మన్నాడు ఇంకొకడు. సంసారి అన్నవాడికి యిది చెప్పడంతోటే, యివన్నీ అయ్యేపని కాదులే అన్నాడు. ఊర్కే యెవడు చేస్తాడు యిదంతాకూడా అంటాడు. మనకింట్లో విధవలు ఉండడం అనేది చాలా సామాన్యమైనది. ఇది ఈ తరం వాళ్ళకి అంతగా అనుభవం లేదు, మీరు ప్రత్యేకంగా, మేమైనా కాస్తంత దానికి అనుభవం వుంది మాకు.  ఇప్పుడు లేదులే. వైధవ్యం అనే పెద్ద మాట లేదు యిప్పుడు. ముందు పెద్ద మాటే.  వాళ్ళకి గుండు గీసేసి, వొకింట్లో మూల పెట్టేసేసి, నువ్వు బయట రాకూడదనో, యిది చూడకూడదనో, అది చేయకూడదనో చెప్పేసేసి యిటువంటి ఆంక్షలు వేశారు. ఎందుకు వేశారు? లేకపోతే ఆ కామతీవ్రత తట్టుకోలేరని. వెంట్రుకలు చూస్తే తన అందం చూసి కామతీవ్రత యెక్కువ అవుతుందేమోనని గుండు గొరిగించేయి అన్నాడు. వాడికి తెలిసింది యిది.  వాడికి సరైన పధ్ధతి తెలిసివుంటే ఈ యేడుపు వుండేది కాదు. నీళ్ళు పోసుకో, తలకాయ మీద నీళ్ళు పోసుకో. రోజుకు నాలుగుసార్లు స్నానం చేసెయ్యి. ఎప్పుడూ తడి బట్టలతో తగలడు. ఆ సరిపోతుంది. మగవాళ్ళకైనా అదే.  బ్రహ్మచారి. వాడికి బుధ్ధులు విపరీతంగా పోతుంటే నూతి దగ్గరికి పోయి స్నానం చేసిరా పోరా అంటారు. అంటే ఎందుకంటే యిన్ని తరాలలో కూడా దీనికి  జవాబు లేదెక్కడ కూడా.  ఏం చేయాల? ఎవ్వడికీ తెలీదు. చేసినవాడు గొప్పవాడు. చేయని వాడు దరిద్రుడు, వాడు వ్యర్థుడు, భ్రష్టుడు పదాలు ఉపయోగించేసి వాడినేదో తిట్టి, ఆ తిట్లకు భయపడి వీడు చేసే పనులు దొంగతనంగా చేసి, తిట్లకి భయపడే, ఇంకేం లేదు. ఇటువంటిదే యిక్కడకి వచ్చిన తర్వాత వచ్చేసరికి ఈ పుస్తకాల్లో సామాజికముగా దీనిపైన ఎంతవరకు మనకు ఆంక్షలు వేశారంటే, మనము కామసూత్ర అనే పుస్తకము చదువుతున్నామని చెప్పడానికి యిష్టపడము.  ఎవరూ యిష్టపడరు.  ‘అది నిషిద్ధమైనది, నీవు చెడ్డ మనిషివి, నీవు చెడిపోతున్నావు’ అనే పేర్లు కూడా మనం చెప్పాము. ఎందుకిట్లా మాట్లాడుతున్నాను అంటే కామతీవ్రత అనేది అంత సునాయాసంగా అందరికీ లొంగేది కాదు. సాధారణంగా యెవడికీ లొంగదు. ఎందుకంటే జంతుప్రవృత్తి అటువంటిది. దాంట్లో మనకు స్వేచ్ఛ అనేది భగవంతుడు యిచ్చినాడు.  ఆ స్వేచ్ఛ వుండడంతోటే ఇంకా సమస్య యెక్కువ అయిపోయింది. నెలకోసారో, పదిహేను రోజులకొకసారో, నలభై రోజులకొకసారో వచ్చిందనుకోండి, పెంట వదిలిపోయేది. అది కాదు. స్వేచ్ఛ యిచ్చాడు.  అదుపు చేయగలిగే  సామర్ధ్యము నీకుంది అంటాడు. దాన్ని మనము దుర్వినియోగము చేసాము.  ఇది వేరే విధముగా తీసుకొని యిటువంటి పరిస్థితులలో మనముండగా, అందరి సాధనలో యిదే ముఖ్య సమస్యగా వుండగా, బాబూజీ మహరాజ్, వొక్కసారిగా వచ్చి, నేను నీకు ఈ సమస్యలో తోడ్పడతాను.  రెండు బిందువులు గుర్తింపు చేసాను నాయనా ‘ఎ’బిందువు, ‘బి’ బిందువు అని.  ఈ ‘ఎ’బిందువు, ‘బి’ బిందువులలో ధ్యానము చేయి.  అలా ధ్యానము చేస్తే నీకు కామ తీవ్రత తగ్గుతుంది. కాలక్రమేణా నీకు సమత్వము కలుగుతుంది. మొట్టమొదటి సారి ప్రపంచంలో వొక వ్యక్తి వచ్చి, యిటువంటి దాన్ని, ఏదైతే ప్రతివొక్కడూ వదిలేసేసి, మనకు చేతకాదని చేతులెత్తేశామో, నాయనా ఈ విషయంలో నీ సాధన నీవు చేసుకోవలసిందే. తలక్రింద నిలబడతావో, రోడ్లో దొర్లుతావో నీ యిష్టం. ఎట్లా చేస్తే అట్లా చెయ్యి, అని చెప్పినట్లు కాకుండా వొక పధ్ధతి అంటూ మనకు యివ్వడం జరిగింది, ఈ బాబూజీ వొక్కడి వల్లనే. కానీ దీంట్లో ఇంకో విషయం కూడా వుంది. ఎందుకు యిది అదుపు లో వుండాల? ఇది చెప్పండి.

మనకెందుకు అదుపు వుండాలి?

ఇది ముఖ్యముగా మన యొక్క యెఱుకలేని ప్రేరేపణ, ఏదైతే మనల్ని లాగుతుందో, దానికి ఆధారము యిది.  మనకి మూలమైన ఆధారము లైంగిక క్రియతోనే కలుగుతుంది.  లైంగిక క్రియ అనేది పునరోత్పత్తికి కూడా అవసరమైనదని మీరు తెలుసుకోవాలి.  దాని ద్వారానే మనము ముందుకు కొనసాగుతాము.  మన మనుగడ ముందుకు కొనసాగాలంటే, మనం పోయిన తర్వాత కూడా మనం కొనసాగాలంటే, మనకు   తరువాతి సంతతి  వుండాలి. ఇది   మూలమైన ప్రేరేపణ.  దీనికి వచ్చిన సాంఘిక వాదోపవాదములవన్నీ వేరే. దాని గురించి మనం మాట్లాడడం లేదు. స్వార్థానికి మూలమిది. మనం బ్రతకాలన్న దానికి ముఖ్య విషయము యిదే. ఇక్కడన్నమాట, యిదే మూల ప్రేరేపణ. దానికి చెందిన వొక వ్యక్తీకరణ లైంగికత్వము. ఇదే మూలము, మూల శక్తి.  దానివల్లే మనకు స్వార్థానికంతా కూడా, తర్వాత రూపకల్పన చేయబడ్ద, నీ యిల్లు కానీ, వాకిలి కానీ, భూమి కానీ తదితరేదైనా కానీ, నాది అని చెప్పుకొనేదాని కంతా కూడా నాంది యిదే. ఇది వుంటేనే నాది అని పలుకుతుంది. ఇది తగ్గితే గాని యితరుల గురించి, పరుల గురించి, మంచి గురించి, ఆలోచించడం అనేది మనకు వీలుపడదు. ఇది అదుపు  కావాలి. మంచి అనేది మనకు కావాలి కాబట్టి దీన్ని అదుపు చేయమన్నాడు పాతకాలం నుంచీ. మంచి అనేది, విశ్వశాంతి అనేది, మానవ కల్యాణం అనేది, మనకు కావాలి కాబట్టి దీన్ని అదుపు చేయండి.

దీన్ని అదుపు చేస్తే నీకు స్వార్థపరత్వం తగ్గుతుంది. పరపరాయణత్వం పెరుగుతుందనే ఉద్దేశ్యంతో, సర్వే జనాః సుఖినోభవంతు అని చెప్పగలిగిన వొక స్థితికి రావాలంటే మనల్ని మనం అదుపు చేసుకోగలిగిన స్థితిలో గాని రాదు. దానికి బదులు బాబూజీ మహరాజ్ ఏమంటారంటే ‘ఏ’ బిందువులో ధ్యానము చేసేటప్పుడు, ‘బి’ బిందువులో ధ్యానము చేసేటప్పుడు ఏమని అనుకోమంటారు? ప్రపంచంలో వున్న వాళ్ళందరూకూడా నా అన్నదమ్ములే.  వాళ్ళందరూ కూడా భగవంతుని యెడల ప్రేమ పెంపొందించుకొంటున్నారు, అని అట్లా వదిలేస్తారు. భగవంతుని యెడల ప్రేమ పెంపొందించుకొనేటప్పుడు జరిగేది ఏమిటి? విశ్వ కళ్యాణం.  అందరూ కూడా భగవత్ పరంగా ఆలోచించ గలిగితే, పరహితం గూర్చి ఆలోచించ గలిగితే, జరిగేది విశ్వ కల్యాణం. కాబట్టి  ఏదైతే మన యొక్క ఆధీనములోకి  తీసుకురావాలనుకొంటామో, ఈయన దాన్ని తిరగవేసి, ఈ  బిందువులపైన  ధ్యానము చేస్తూ, యితరులు భగవంతుని యెడల ప్రేమ పెంపొందించుకొంటున్నారు అన్న భావనతో వుంటే, యిది కూడా అదుపు అవుతుందని.  చాలా చిన్న విషయము. ఏ విషయమైనా కానీ,  యాప్పిల్ పండు పైనుంచి క్రిందకు పడిందనంటే న్యూటన్, వొక్కడే  సూత్రం వ్రాసాడు.  మిగతా వాళ్ళు?  అంతకు ముందూ పడ్డది, సంవత్సరాల తరబడి, యుగాల తరబడి పడుతూనే వున్నాయి.  వాడు వొక్కడే సూత్రం వ్రాసాడు. అలాగ యిది చాలా చిన్న విషయమే. ఇటు తిప్పాడు. ఇటు తిప్పేసరికి అదుపు.

ఇప్పుడు తరువాతి ప్రశ్న, అదుపులోనికి వస్తుందా సార్? మేం చెప్పగలిగేది ఏమిటంటే మా స్వానుభవం అది. అదుపు అంటే పూర్తిగా నాశనము కాదు. పాత కాలంలో ఏం చెప్పాడు? పూర్తిగా నాశనము చేస్తేగానీ గతి లేదు అన్నాడు. దీన్ని పూర్తిగా చంపేయాలి, సామాన్యముగా యెవరైనాగాని, ఆధ్యాత్మికత అంటే ఇంట్లో వాళ్ళు వొప్పుకోరు, సాధారణంగా స్త్రీలు వొప్పుకోరు. మాకు వొక అభ్యాసి వున్నాడు లేండి, ఆయన ధ్యానము అంటూ కూర్చుంటే వాళ్ళావిడ వచ్చి వొక ప్రక్క చెయ్యి, వాళ్ళమ్మగారు వచ్చి ఇంకొక చెయ్యి పట్టి లేపేసేవాళ్ళట. ఎందుకంటే వీడు యిది చేసి సన్యాసి అయిపోతాడనే భయం వాళ్ళకి. సంసార సుఖానికి పనికిరాడు వీడు అని వాళ్ళావిడ, వీడు నాకు కొరివి పెట్టడేమోనని ఆవిడ, యిద్దరూ కలిసేసి వాడిని లేపేసేవారట. వాళ్ళు అర్థం చేసుకోవడానికి చాలా రోజులు పట్టింది. ఇలా జరుగుతాయి ఎందుకంటే ఈ భయం అనేది వుంటుంది ప్రతి వొక్కడికి.  యోగం దానికి రాడు. అందుకనే ఈయన ఏమంటాడు? పూర్తినాశనము అని నేను మాట్లాడనయ్యా.  నాశనము గూర్చి కాదు, అదుపు, సంతులమునకు రా.  నీ కిచ్చిన స్వేచ్ఛని సద్వినియోగం చేసుకో. దానిని నిర్దేశించిన పని కొరకు ఉపయోగించు. తరువాత అదుపు చేసుకో అంటాడు.  

అందువలన  ఈ అదుపు అనేది ఏదైతే కష్టమనీ, దుస్సాధ్యమనీ, మనవల్ల కాదనీ చెప్పేసేసి మనం అనుకొన్నామో, అలా కాదు, యిది ఔతుంది అన్నారు. కాబట్టి, ఆ ప్రకారముగా యిది, చాల సార్ధకత్వమైనది.  ఏ పద్ధతిలో వొక విధివిధానము ఉన్నదో, కావలిసిన ఫలితమును యివ్వగలదో, అదే ఈ సత్యపథమార్గము అనే పద్ధతిలో ఉన్నది.

మనము చేర గలుగు వివిధ చైతన్య స్థితులు ఏమిటి? ఎటువంటి స్థాయి? జంతుస్థాయి నుంచీ, మానవ స్థాయికి వచ్చి, మనీషి స్థాయికి యెదిగి, దానిపైన మనం ఋషి స్థాయికి పోవాల్సిన స్థితి మనకుంది. ఋషులం కావలసిన హక్కు మనకుంది. ఎప్పుడు నువ్వు ఋషి? ఋషి అనే పదం చాలామంది ఉపయోగిస్తుంటాము. ఋషి అంటే యెవడు? జ్ఞాని జ్ఞానియే. వాడెందుకు ఋషి అవుతాడు? ఎవడైతే వేదాంతం పూర్తిగా తెలుసుకొంటాడో వాడు జ్ఞానియే. ఋషి అనే వాడెవ్వడంటే, యితరులకు నీడనిచ్చే వాడు. పదిమందికి సహాయం చేసేవాడు ఋషి. ఆ స్థితికి యెదగ గలిగిన సమర్ధత మనకుంది. ఆ స్థితికి మనం రావాలి. దానిని నువ్వు పొందగలుగుతావా అని అంటే, అవును  పొందగలుగుతాము. ఎంత సమయంలో? రోజంతా అదే పనా అంటే,  లేదు  మీరు తగు సమయము దానికి కేటాయించి, సతత స్మరణను వృద్ధి చేయాలి. సతతస్మరణను వృద్ధి చేయాలని అందరూ చెప్పారు. నిరంతర భగవత్ ధ్యాస వుంటేనే గానీ, ఉత్తమ గతులు దొరకవు. ఉత్తమ గతులు అంటే, ఉత్తమ మనః స్థాయి. అంతే కదా! అది రాదనంటాడు. కరక్టే. దానికని మనం రోజంతా అదే భజన చేస్తూ కూర్చుంటామా? లేకపోతే అదే రామనామం చెబుతూ వుంటామా? అదే రహీం నామం చెబుతూ వుంటామా?  చెప్పము కదా అది సాధ్యము కదా. ఎప్పుడైతే సాధన వల్ల ఆ భగవంతుడు మనతో వున్నాడనే జ్ఞానం ధృడంగా కలుగుతుందో అప్పుడు మనం చేసేది నిరంతర స్మరణే. ఎందుకంటే, ఏ పని చేసినా ఆయన తోనే చేస్తూ వుంటాం. ఆయన యెరుకతో మనం చేస్తూవుంటాం. అది వొక స్థితి. ఆ స్థితికి తీసుకు రాగలుగుతాడు.  కాబట్టి, ధ్యేయ సాధన కనుక మనం తీసుకొన్నామంటే, నిస్సంశయముగా మనం చేయగలుగుతాము. మిగతా వాళ్ళు దీని గూర్చి యెక్కువ మాట్లాడరు.  అటువంటి స్థితి అనేది మీకు చాలా తొందరలోనే యిస్తాడు.  మీరు కానీ సత్యోదయము  లో చదివినారంటే బాబూజీ గారు చెప్తుంటారు, నన్ను నమ్మి కనుక మీరు సాధన  గాని సరిగ్గా చేస్తూవుంటే మీకు కొద్ది కాలంలోనే, కొద్ది నెలల్లోపే ఈ యొక్క  స్థితి,  అజపస్థితి, వస్తుందనంటాడు.. అజపస్థితి రావడం అంటేనే సతతస్మరణ ప్రారంభమయినట్టు. జపం చేయకుండానే జపం చేసినట్టు. దానికి సాధారణ వ్యాఖ్యానం ఏమిటి? జపం చేస్తూ, నిద్రలో కూడా అదే పలవరింత వున్నటులయితే అజప స్థితి అంటారు.  సాధారణంగా మనకు సాంప్రదాయంగా మాట్లాడేమాట. తెలిసో తెలియకో అన్న మాట అది. దాని గూర్చి మాట్లాడవలసిన అవసరం లేదు. మనము నోటితో పలికేది కాదు. మనకు ఆ భావన స్థిరంగా వుందా లేదా అనేది రావాలి మనకు.  పని చేస్తూండగా ఈ భావన కూడా మనతో వుండాలి.  భగవంతుడు మనతో వున్నాడు అనే భావన, నిరంతరము భగవంతుని సాన్నిధ్యములో నేనున్నాను అనే భావన  గాని రావాలంటే, ఈ  సాధన చేయండి. అనుభవించండి. అజప స్థితి అనేది వస్తుంది అంటాడు. ఇంత తొందరగా మీకు ప్రయోజకరంగా చెప్పే పద్ధతి  ఇంకేది లేదు. ఎందుకంటే మిగిలినవి యధార్ధ విషయము నుంచి దూరమై ఉన్నారు లేక చేరుకోవలసిన లక్ష్యము నుంచి దూరమై పోయారు. వీలు పడనిది చెప్పుంటారు. లక్ష్యమయినా మార్చేసి వుంటారు. లక్ష్యము యెప్పుడైతే మనము కర్మశు కౌశలం, యోగః కర్మశు కౌశలం అనే చాలా ముఖ్యమైన జ్ఞానం పెట్టుకొంటే, అప్పుడు మనం గృహస్థ ధర్మంలో చేయవలసిన పనులన్నీ కూడా సమర్ధతగా చేస్తూ నిరంతరం భగవత్ ధ్యాసలో మనం వుంటూ, భగవంతుడి ఆసరాతో మనం చేయడం అనేది ఈ విధానము యొక్క సార్ధకత్వము.

కృతజ్ఞతలు.