‘ప్రార్ధన’
గురించి
1996
బసంత్ ఉత్సవములో పూజ్య శ్రీ కే.సి. నారాయణ గారు ఇచ్చిన
ప్రసంగముపై ఆధారితము.
ఈరోజు
మన ముందున్న విషయము
‘ప్రార్థన’.
ఇప్పుడు ఈ ప్రార్థనతో మనము ఏదైనా గాని సాధించగలము అనేది
ఒకటి మనము తెలుసుకొనవలసి వున్నది ప్రార్థన అనే దానిని
బాబూజీగారు మన సాధనకు అనుసంధానము చేశారు. ఏవిధముగా తీసుకు
వచ్చారు అంటే నిదురించుటకు ముందు చేయవలసిన ప్రార్థనగా
చెప్పారు.
“రాత్రి
పరుండబోవుటకు ముందు భగవంతుని సన్నిధానమును భావించుచూ,
తెలియక చేసిన తప్పులకు దీనతతో పశ్చాత్తాపమును
తెల్పుకొనుము. అట్టి తప్పులను మరల చేయనని కృతనిశ్చయముతో
వినమ్ర భావనతో క్షమాభిక్షను అర్థించి ప్రార్థింపుము.”
దీని ద్వారా మన యొక్క మానసిక స్థితిని గురించి
ఆయన అడుగుతున్నారు. ఆ
వివరణము గాని మీరు చదివితే ముఖ్యంగా మీరు తెలుసుకునేది
ఏమిటంటే:
1.
జీవిత లక్ష్యము - జీవిత లక్ష్యము అనగా ఏమిటి?
2.
మానవుని జీవితములో పరిపూర్ణత - మానవుని జీవితములో
పరిపూర్ణత అనగా ఏమిటి?
3.
పరిపూర్ణత - పరిపూర్ణత అనగా ఏమిటి?
4.
మనిషి ఎప్పుడు పరిపూర్ణుడు కాగలడు?
దానికి బాబూజీ పరంగా మనకు లభించే జవాబు
ఏమిటంటే:
1.
నీవు ప్రభువును నిజముగా ప్రభువేయని గుర్తించుట
2.
నీవు ఆతని దాసుడవని గుర్తించుట
3.
మరియూ నిన్ను నీవు ఆతని సేవకు సంపూర్ణముగా
అర్పించుకొనుట
మూడు విషయాలు చెప్పాడిక్కడ. ఇదే మానవ జీవితములో పరిపూర్ణత
అంటాడు, మానవ జీవితములో పరిపూర్ణత అంటే ఇదే! అంటే మన
అధ్యాత్మిక యాత్రలో గాని, ఆదిభౌతికంలో గాని, ఎటువంటి
స్థితిని నీవు పొందినాగాని, నువ్వు చక్రవర్తివి అయినాగాని
ఇక్కడ, ఆధ్యాత్మిక విషయంలో ధర్మచక్రవర్తివి అయినాగాని,
నీవు ఎటువంటి
స్థితిని పొందినాగాని బాబూజీగారి మాటల్లో చెప్పాలంటే,
మహాపరిషద్ ఆయనకి ఏదైతే వుందో, అది వున్నాగాని, ఆయనే
మహాపరిషద్ ఈ రోజు. ఈ రోజు అంటే ఇంకో వెయ్యి సంవత్సరాలదాకా
ఆయనే వుంటాడు. అటువంటి వ్యక్తి, అటువంటి
విశిష్టమూర్తిత్వము కూడా నేర్చుకో వలసినది,
తెలుసుకోవలసినది ఏమిటి అంటే
‘భగవంతుడు
భగవంతుడే’,
‘ప్రభువు
ప్రభువే’.
ఈ విశిష్టమూర్తిత్వము, ఈ మహాపరిషద్ కూడా ఆ భగవంతునికి
దాసులేనని, మరియూ ఆయన సేవకై ఆత్మసమర్పణ చేసుకొనిన
వారేనని. అది ఆయన స్థితి.
మన స్థితి, అది ఏదైనను, బ్రహ్మండములో వుండడమో, పర
బ్రహ్మండములో వుండడమో, పిండదేశములో వుండడమో లేక ఎక్కడా
వుండకపోవడమో, ఎక్కడ వున్నాగాని ఏదో ఒక స్థితిలో వుంటాము.
ప్రభువును ప్రభువుగా ఎఱుక గలిగియుండుట మరియు తాను
దాసునిగా/సేవకునిగా తెలిసి వుండుట. ఎల్లప్పుడును భగవంతుని
సేవ చేయుటకు ఇచ్ఛ కలిగియుండుట, భగవంతుని సన్నిధిలోనుండి
ఎల్లవేళలా భగవంతుని సేవ చేయుట. ఈ విధముగా తనను తానుగా
సమర్పించుకొనుటయే మానవజీవితమునకు పరిపూర్ణత అందురు.
ఇది ఎప్పుడు సాధ్యము అవుతుంది అని అంటే, మనము శూన్యతా
స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే సాధ్యము అవుతుంది. మన
కోరికలంటూ లేకుండా దైవేఛ్చ మాత్రమే మన ఇఛ్చ అయినప్పుడు
మాత్రమే వీలుపడగల విషయమిది. అందువలన ప్రార్థన
చేయడానికి
అర్హత ఏమిటి అంటే మొదట నీవు శూన్యతా స్థితిలో ఉండాలి.
అటువంటి వాడు ఎందుకు
ప్రార్థన
చేస్తాడు? వాడు ప్రార్థన చెయ్యడు. నా ఉద్దేశంలో వాడు
కోరుకునేది ఏమీ లేకపోతే, శూన్యతా స్థితిలో వున్నవాడు
చేసేది ఏమి ప్రార్థన అని అంటే అది విశ్వ క్షేమము గురించి
చేయు ప్రార్థన అవుతుంది.
మన చైతన్యము ఉందే అదే మన యొక్క వ్యక్తిత్వము అత్యున్నత
స్థితికి చేరి, ఆస్థాయిని తనలో నిలుపుకొనగలిగిన
వ్యక్తిత్వము ఎల్లప్పుడూ
‘ప్రార్థనా
స్థితి’
లోనే ఉంటుంది. ఎల్లప్పుడూ దైవము యొక్క ఉనికి వుంటూ,
మనమాతనికి దాసులమని మాత్రమే అని గుర్తించుకొను స్థితిలో
వుండుటయే ప్రార్థన.
ప్రార్థనా విధానమును, చాలావరకు సాధారణమైన దిగువస్థాయికి
మనము తీసుకొని రాగలిగితే, దిగువస్థాయి అంటే నా
ఉద్దేశ్యములో స్థూలస్థాయి అని కాదు. ఇటువంటి అత్యున్నతమైన
భావన, శూన్యస్థితిలో వున్నప్పుడు మాత్రమే ప్రార్ధన
వీలవుతుంది. మనము అంతటి అత్యున్నతస్థితి
లో లేము కాబట్టి, మనకు అన్వయించుకోవల్సిన పధ్ధతి ఏమిటి
అంటే ఆయన చెప్పిన ప్రార్థన వచ్చింది. దాంట్లో ఏముంది?
“ఓ
ప్రభూ! మానవజీవనమునకు నీవే యధార్థ లక్ష్యము. - అనగా
భగవంతుని భగవంతునిగా ఎఱుకగలిగి యుండుట అయినప్పటికీ, మేము
మా కోరికలకు బానిసలముగా వున్నాము. ఇక్కడ జరిగిన మార్పును
గుర్తించండి. మన నిజస్థితి ఏమిటి? మనము భగవంతునికి
దాసులముగా ఉండవలసినది. అలా వుండుట పరిపూర్ణత అవుతుంది.
కాని మనము మనకోరికలకు దాసులము అయి వున్నాము.
అందుకని ఇది దిగువ స్థాయిలో సవరించిన ఒక ప్రార్థన.
ఇక్కడ ఉత్పన్నమయ్యే ప్రశ్న ఏమిటంటే ఎవరు సహాయము చేయాలి?
ఇంతకు ముందున్న విధంగా అయితే, మనము భగవంతునికి సేవ ద్వారా
సహాయము అంటున్నాము. కాని మనము ఇంకా ఆస్థాయికి ఎదగలేదు.
కాబట్టి మనము ఆయనకు సహాయము చేయగలిగే స్థితిలో లేము.
అందువల్లనే మనము భగవంతుడినే మనకు సహాయము చేయమని అడుగు
తున్నాము.
‘మేము
ఆధ్యాత్మికోన్నతికి ప్రతిబంధకములయిన మాకోరికలకు బానిసలమై
వున్నాము. ఈ పరిస్థితి నుంచి మనలను విముక్తులనుచేసి ఆయనకు
సేవ చేయగలిగే స్థాయికి చేర్చమని’
కోరుతున్నాము.
“ఆస్థితికి
మమ్ము
గొనిపోవుటకు నీవే ఏకైక దైవము, శక్తివి”
అని
వేడుకొనుచున్నాము.
భగవంతునికి దాస్యము, మనము భగవంతునికి దాసులము కావాలి.
కాని, ప్రస్తుతము మనము కోరికలకు బానిసలమయి వున్నాము.
అందువలన, పూజ్య బాబూజీగారికి, అత్యున్నత
సూక్ష్మచైతన్యస్థితిలో వచ్చిన ప్రార్థన ఎవరికైతే
ఉపయోగపడుతుందో, మనకి ఉపయోగపడాలో, అటువంటి ప్రార్ధన అలా
సవరణము చెంది వచ్చినది.
కాని పదవ ఆదేశములో మాత్రం ఆయన అసలు విషయాన్ని స్పష్టము
గా చెప్పాడు. మన స్థితి ఏమంటే
“ప్రభువు
(Master)ను
నిజముగా ప్రభువేయని గుర్తించి తానాతని సేవకు సంపూర్ణముగా
నియుక్తుడైన దాసుడనని భావించుటయందే మానవ జీవితమునకు
పరిపూర్ణత గలదు”.
ఈ స్థితిలో మనం లేము కాబట్టి ఆ
ప్రార్ధన
ఇచ్చాడు. ప్రార్ధన ఇచ్చి ఏమన్నాడు? నా చేత కావట్లేదనేసి
ప్రార్ధన చెయ్యి అంటాడు. ఎందుకు
పడుకునేముందు చేయాలి?
మన అంతిమ లక్ష్యము ఏమిటి? విశ్రాంతి, చిట్టచివరి లక్ష్యము
విశ్రాంతి.
నీవు పడుకునే దానికి ముందేమిటి.
ఇది భౌతికంగా దానికి ప్రతీక.
ఇది
ఒక విదమైన ప్రతీక. దాని యొక్క నకలు, ఒక అనుకరణ.
మనము ప్రతి రోజూ పడుకొంటాము అంటే విశ్రాంతి పొందుతాము.
అలా విశ్రాంతి అని దేనిని మనము కోరుకుంటామో అటువంటి
స్థితి లోనే మన శరీరము కూడ వుంది. కాబట్టి ఆ శరీరము మనకు
సహకరిస్తుంది. అటువంటి స్థితిని మనము అవకాశముగా తీసుకొని
ఆ సమయములో ప్రార్థన చేయాలి అన్నాడు.
ఇప్పుడు మనకొచ్చిన ధౌర్భాగ్యమేమిటి, ఆ నిద్ర మనకి
ముంచుకొచ్చేస్తోంది. అది మనలను ప్రార్థనను
చేసుకోనివ్వదు. సరే ఒక అర సెకండో, ఒక సెకండో, రెండు
సెకండ్లో, ఒక నిముషమో, మహా అయితే పది నిమిషాలో ఇంతకంటే మనం
సాధన చేసేది
లేదు. ఇక సాధన కూడా లేదు. ఇక్కడ ఇంకా ఏముంది? ఏడవడమే,
అయ్యా నాకు చేతకావట్లేదు, నువ్వు సహాయంచెయ్యి. ఇదే కదండి
దాంట్లో ఉన్న పరిస్థితి.
ఒక మాటలో చెప్పాలంటే అదే పరిస్థితి.
దాన్ని
మనం చెయ్యలేకపోతున్నాం. ఎందుకు చెయ్యలేకపోతున్నామనంటే
సోమరితనము, మత్తు.
ఇలా కాకుండా, మనయొక్క జీవిత లక్ష్యమును నిర్ణయించుకోవాలి.
మన జీవిత గమ్యం. ఏదైతే విశ్రాంతి
అనేది ముందుగానే మనం నిర్ణయం చేసుకుంటామో,
ఈ శారీరక విశ్రాంతి చేసేదానికి ముందు కాస్తంత సమయము
తీసుకొని నీయొక్క బలహీనతలు అన్ని కూడా ఆయనకి చెప్పి, నీ
తప్పిదాలాయనకి చెప్పి, దానికి పశ్చాత్తాప పడుతూ ఒక విధమైన
ఒక అతి వినమ్ర సమర్పణ,
అంటే ఏమిటి? వినమ్రతతో, నాచేత కాదు నీవే సహాయం చెయ్యాలి
అనే ఒక భావంతో మనం గాని అయన్ని కోరుకుంటే దానికి
స్పందిస్తాడంటాడు, జవాబిస్తాడు అనంటాడు. ఎవరు?
మాస్టర్ స్పందిస్తాడంటాడు. దానిలో ఏమంటాడు? ఈ వినమ్రతా
భావము
వస్తే, వెనువెంటనే అతనొస్తాడంటే, ఎప్పుడొస్తాడు? దానికి
ఇంకొక
నిబంధన పెట్టాడు. భగవంతుని దృష్టి తప్పితే ఇంకేదీ
కోరకుండాగాని, అంటే ఏమిటి? నీవే తప్ప ఇతఃపరంబెరుగను అని
చెప్పాలి. లేదులేదు నాకు నేను రేపటి నుంచి నేను ఈ
తప్పిదాలు చెయ్యకుండా నా శ్రమతో నేను బాగుపరుచు కుంటాను
అనేది కాదిక్కడ. బాగుపరుచు కుంటాననే నిర్ణయం మీరెట్లాగు
చేస్తారు. కాని దానిపైన ఆధారపడి మన స్వప్రయత్నముతో మన
ప్రయత్నముతో దాన్ని బాగుపరుచు కుంటామంటే మాత్రం
అది వీలుపడదు. అప్పుడు భగవంతుని దృష్టి మనవైపు పడదు.
ఇంతకుముందు ఆయన చెబుతూ నువ్వు ద్వారకా నివాసా అని
మొదలెట్టామనుకోండి, ద్వారకతో పోయినంత మాత్రాన మనకు
సమస్యాపరిష్కారము అయిపోతుంది అనేది,
రిషికేష్ పోతే అక్కడ సమస్యాపరిష్కారము అవుతుందనుకుంటే, మరి
ఆ పరిష్కారము ఎంత వరకు అవుతుందో అంతే అవుతుంది. దాని
గురించి చర్చించే అవసరము లేదు.
మొత్తము
కూడా ప్రభువు చేత, ఆయన వల్లనే మొత్తము జరగాలి అనే ఒక
పూర్తిగా ఆయన పైనే ఆధారపడివున్న భావనతో, భక్తితో గాని మనం
ప్రార్థన చేస్తే తనకు తానుగా ఆయన
దృష్టి
నీవైపు మరలుతుంది అంటాడు. అందువలన,
నిదురపోయే ముందు సమయములో మనము నేర్చు కోవల్సింది ఏమిటి అని
అంటే,
నీ చిట్టచివరి దశ యొక్క ప్రతిబింబముగా నిన్ను నీవు
చేసుకొంటున్నావు.
తెల్లవారు జాము వచ్చేసరికి ఏమన్నాడు,
మొదటి ఆదేశములో మీకు సూర్యోదయముతో కూడా, అంతకు ముందుగా
గాని లేవమని. నీ యొక్క ఆ సమయం ఉపయోగించుకోమంటాడు.
మొత్తం దీంట్లో కూడా సత్యపధమార్గసిద్ధాంతం లోకూడా, ఏదైతే
ప్రకృతి లో వుందో దాన్ని పూర్తిగా ఉపయోగించుకొని మన సాధన
చెయ్యమంటాడాయన. తెల్లవారు జామునే ఎందుకు చెయ్యాలి, ఎనిమిది
గంటలకు నేను లేస్తానంటే, ఎనిమిది గంటలకైన లేవవచ్చు
తరువాతైనా లేవవచ్చు అదికాదు ముఖ్యాంశము
అక్కడ. ఆయన చెప్పిందేమిటంటే,
నీవు ప్రకృతి సహాయము కావాలనుకుంటే,
నీకు ప్రకృతి సహాయం చెయ్యాలనుకుంటే,
అది వుంది.
అందుబాటు
వుంది. సంధ్యాసమయం తెల్లవారు జామున కూర్చుంటే ఏదైతే ఇది
రెండింటికి, ఒక
activity
కి
inactivity కి
సంధ్య
వుంటుందో అక్కడ మొదలు
పెట్టు నీ సాధన. నువ్వు సాయంకాలం వచ్చేసరికి విశ్రాంతి
తీసుకుంటావు.
నీవు అలసివుంటావు. మనసులో పెట్టుకో. నీవు దీనికి
similar situation
లో ఉంటావు కాబట్టి
ఆ సమయములో నీవు ప్రార్థించు అని అంటాడు. అందుకని ప్రార్ధన
అనేది
అంత సులువు కాదు.
ఇది ఒక్కొక్క స్థితిలో ఒక మాదిరిగా వుంటుంది. మొదట్లో
సహజముగా చేసినప్పుడు మన బాధలు మనకుంటాయి, అవి
నివేదిస్తూవుంటాం. కొన్ని రోజుల తరవాత ఈ బాధలు వుంటూనే
వుంటాయి, నాయనా నీపైన నా మనసుంటే చాల్లే అనేసి ఒకటంటాం.
సరే నీ పైన నాకు పెద్ద దృష్టి
ఏమీ అక్కరలేదులే నాకు నీ పని చేస్తే చాలు అని అంటాం.
నువ్వు నన్నేం చూడనక్కరలేదులే, నీపని నేను చేస్తే చాలు అని
ఒక స్థితి
కూడ వస్తుంది ప్రార్ధనలో.
ప్రార్ధనలో మనమేమి కోరుకుంటామంటే కైంకర్యమే చివరిగా
అవుతుంది. కైంకర్యమే అంతిమ లక్ష్యము కూడా.
మొదట్లో మనకు ఆయన యొక్క సాక్షాత్కారం కావాలని గాని ఆయన
సన్నిధానం కావాలని కోరుకుంటాము. కాని ఆ తర్వాత
జరిగేదేమిటంటే కైంకర్యమే నాకు సర్వము. కైంకర్యము
అన్నిటికన్నా ముఖ్యము,
అదే ఆది
అదే అంతము
అంటాం. ఇవన్నీ కూడా స్థితులు. ఇప్పుడు దాని గురించి అర్ధము
చేసుకోవడం బుద్ధి పరంగా అది అంత సులువుగా అర్ధమయ్యే
విషయాలు
కావు. అందుకే పరంపరలో పెద్దగా దీని గురించి మాట్లాడరు.
ఎందుకంటే ఆ స్థితికి వచ్చినప్పుడు చెబ్దాంలే అని వాళ్ళ
ఉద్దేశ్యం.
కాని ప్రార్థన
అని
మనకి ఏదైతే ఆయన చెప్పాడో,
ఆ సమయమును సాధ్యమైనంత ఎక్కువగా ఉపయోగించుకొనవలెను.
కాబట్టి రాత్రి పరుండబోవు సమయములో సోమరితనమును మానేసి
కాస్తంత వినమ్రతతో, అణుకువతో మనముగాని ఆయనను
ప్రార్థించగలిగితే,
మనప్రార్థన తప్పనిసరిగా విజయవంతమగును. ఆయనపైన పూర్తిగా
ఆధారపడినప్పుడు తప్పకుండా ఆయన మిమ్మల్ని వింటాడు. కాని
మనలో అన్యధా శరణం నాస్తి అనే
భావము
మాత్రం మనస్సులో నిండివుండాలి.
నీవే ఏకైక దైవము మరియు శక్తివి.
‘ఏకైక’
అనే పదానికి అర్ధము చాలా వుందక్కడ. అంటే మనము
విశ్వసృష్టికి మూలకారకుడైన దైవము గురించే మాట్లాడు
తున్నాము గాని వేరెవ్వరిని గురించి కాదు.