సమస్త మానవ కళ్యాణానికై ఉద్దేశించిన నా గురువర్యుల సందేశాన్ని
మీకు అందించడం నాకెంతో ఆనందంగా ఉంది. ఆయన పవిత్ర శుభనామం
సమర్థగురు మహాత్మ శ్రీ రామచంద్రజీ (యు.పి. లోని ఫతేఘడ్ కు
చెందిన వారు) ఆయన మన సంస్థకు ఆది గురువు. ఆయన తన
జీవితాన్నంతటిని మానవాళి ఆధ్యాత్మిక సేవకై అంకితం చేసారు.
ముక్తిని సాధించడం కష్టసాధ్యమని అందులో ఒక జీవిత కాలంలోనే అది
మరీ అసాధ్యమని సామాన్య జనబాహుళ్యం నమ్ముతారు. అది తప్పు
అభిప్రాయం. మన యీ జీవితమే మనల్ని ముక్తి స్థాయికి తీసికొని
పోగల ఆఖరి జీవితం కావచ్చు. సాధనకు నిజమైన శ్రద్ధ వుండి,
సరైన గురువు కలిగివున్న భాగ్యం లభించినప్పుడు వాస్తవానికి యీ
జీవితంలోనే,
అంతేకాదు,
అందులో ఒక భాగంలో కూడ,
ముక్తిని పొందడం తప్పక సాధ్యం కాగలదని మా సమర్థ గురువర్యులు
నిర్భయంగా నొక్కి చెప్పారు. దీనిని ఆయన అనేక సందర్భాలలో
నిదర్శనాత్మకంగా చేసి చూపెట్టారు. ప్రత్యక్షానుభవం మాత్రమే
దీనిని ఋజువు పరచగలదు.
హృదయంపై ధ్యానం అనేది అత్యంత సులభమైన పద్ధతి అని ఆయన
ఉపదేశించారు. ఇది యీ సంస్థలో అనుసరించబడుతోంది. ఇతర చోట్ల
నాసికాగ్రం,
భ్రూమధ్యము మొదలైన కొన్ని యితర స్థానాలపై ధ్యానం చేయమని
బోధిస్తారు. అవి కూడ కొంతవరకు ఉపకరించవచ్చు. కాని నా
అభిప్రాయంలో హృదయంపై ధ్యానం అత్యంత సులభము,
ఫలప్రదము అయినట్టిది. ""రాజయోగ ప్రభావం''లో
యీ విషయాన్ని తగినంతగ చర్చించి యున్నాను. మనం యింత వరకు బాహ్య
విషయాలపై లగ్నమై ఉన్నాం. కాని యిప్పుడు మనస్సును లోనికి
మరల్చి అంతర్ముఖులం కావాలి. మన ప్రయత్నాలలో విజయాన్ని
పొందినప్పుడు మనం స్వతస్సిద్ధంగానే ఆధ్యాత్మికానుభవాలను పొందడం
ప్రారంభిస్తాం. ఆధ్యాత్మిక మార్గంలో మన ప్రయాణం నిరాటంకంగా
సాగిపోతుంది. ఇతర సాధనావిధానాలు కూడ కొంతవరకు సహాయపడవచ్చు.
కాని మనం బాహ్య విషయాలలోనే అనురక్తులం అయి వున్నంత వరకు,
మన దృష్టి మాత్రం ఎన్నటికి లోపలకు మళ్ళదనడం నిశ్చయం. అందువలన
సరళంగాను,
సహజంగాను వుండి ఎటువంటి స్థూల ప్రభావాలు లేకుండా వున్నవే
అత్యంతసహాయకరమగు పద్ధతులు. అన్నింటికీ అతీతమైన అత్యంత
సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ""దానిని''
పొందడానికి మనల్ని అత్యంత తేలికగాను,
అత్యంత సూక్ష్మంగాను తయారు చేసే పద్ధతుల వైపుకు మనం సహజంగానే
ఆకర్షితులం అవుతాం. చిన్న బిడ్డను నవ్వించదలచినప్పుడు మనం
వానివలె అమాయకత్వాన్ని నటిస్తాం. అదేవిధంగా దైవ ప్రాప్తికి
మనం ఆయనవలెనే తయారు కావాలి.
ఆధ్యాత్మికతకు అత్యంత అవసరమైన మరో విషయం సమత్వము. ఈ పదంలో
విస్తారమైన భావం ఇమిడి వుంది. అది ఇతరులకు ఆమోద యోగ్యంగా
వుండేటట్లు మన బాహ్య జీవన విధానాల్ని సరిదిద్దు కోవడానికి
మాత్రమే సంబంధించినది కాదు. అది మన మానసిక శారీరక
కార్యరంగానికంతటికి విస్తరించినటువంటి విషయం. మా పూజ్య
గురువర్యుల అభిప్రాయంలో ఒక వ్యక్తికి ఏ విషయంలోనైనా సమత్వం
లోపించినట్లయితే,
అతడు ఎంత ఉన్నత స్థితిలను పొందినప్పటికి,
ఆధ్యాత్మిక రంగంలో కనీసం అడుగు మోపినవానిగ కూడ పరిగణించనక్కర
లేదు. నిజానికి సమత్వమనగా మనలోని అస్థిమిత ప్రవృత్తులు
చాలవరకు సద్దుమణిగి వుండటమే. ఇంకా ఏదైనా మిగిలి వుంటే అది
మనం విహరిస్తున్న మండలం యొక్క స్థితికి సంబంధించి ఉంటుంది.
అన్ని మండలాల్లోను,
కొన్ని గ్రంథులు వున్నాయి. సృష్టి కొరకు మూలము నుండి
క్రిందికి ప్రకృతిశక్తి ధార ప్రవహించినప్పుడు కలిగిన కుదుపులు
గ్రంథులను ఏర్పరచాయి. అవి శక్తి కేంద్రాలయినాయి. ఈ ప్రవాహ
ధారలగుండా మనం ఈదుకుంటూ పోవునప్పుడు ధ్యానశక్తి వలన ఈ
గ్రంథులు వికసించి మన పురోగమనాన్ని మరింత సులభం సుగమం
చేస్తాయి. ఇంకాపైకి వెళ్లినట్లయితే గ్రంథుల ప్రభావం తగ్గి,
ఎంతో స్వచ్ఛంగ వున్న మండలాన్ని మనం ప్రవేశిస్తాం. ఈ విధంగా
మనం దశల వారిగ పయనిస్తూ,
మాయ దాదాపు పూర్తిగా నశించినట్టి స్థితిని చేరుకుంటాము.
మహామహా ఋషులు కూడా సాధారణంగా యింతవరకే వెళ్లగలిగారు. కాని ఇంకా
ఎంతో మిగిలి వుంది. ఆధ్యాత్మికదృష్టితో పరిశీలిస్తే,
మనం దాటినది కేవలం అయిదవ వృత్తమేనని (‘సత్యోదయము’
యందలి 23 వృత్తములుగల పటము),
ఇంకా దాటవలసినవి పదకొండు వృత్తాలున్నాయని మాత్రం చెప్పగలను.
మనం యీ పదహారింటిని దాటినప్పుడు,
నేను “రాజయోగ ప్రభావం” లో చెప్పిన కేంద్ర మండలంలో
ప్రవేశిస్తాము. ఇంతకు పూర్వము నశీరీరులైన ఆత్మలకు దీనిలోకి
ప్రవేశం దుస్సాధ్యంగ వుండేది. కాని నా గురువర్యుల అద్భుత
పరిశోధనా ఫలితంగా ఆ స్థితిని యిప్పుడు భౌతిక శరీరంతోనే పొందడం
సాధ్యమవుతుంది. ప్రజలు దీనిని నమ్మకపోవచ్చు. కాని ఒక వ్యక్తి
దాని కోసం పరిశ్రమించినప్పుడు గాని,
లేక అతనికి,
తన ప్రాణశక్తి ప్రసారంచే,
ఆ స్థితి సందర్శనాన్ని కనీసం ఒక్క క్షణమైన కలిగించగల సమర్థ
గురువు లభించినప్పుడు గాని,
ఈ స్థితిని ప్రత్యక్షంగా అనుభూతి చెందవచ్చని నేను చెబుతాను.
భక్తిని గురించి చెప్పాలంటే,
నా అంతర పరిశీలన వెళ్ళగలిగినంత వరకు,
జనులు సామాన్యంగా దేన్ని భక్తి అని భావిస్తారో అది వాస్తవానికి
పొగడ్త మాత్రమేనని నేను నిర్భయంగా చెప్పగలను. నిజమైన భక్తి,
పొగడ్త కంటే ఎంతో భిన్నమైంది. అది దైవంతో వుండే సరళమైన,
శక్తివంతమైన తిరుగులేని అనుబంధం. ప్రేమయొక్క బాధలు కూడ
అనుభవించేవారు కూడ కొందరున్నారు. నా అభిప్రాయంలో అవి
వ్రణంయొక్క పోటువంటి బాధలని వివరించడం మరింత సమంజసంగా వుంటుంది.
అయితే అవి సాధారణమైన పొగడ్త స్థాయి కంటె కొంచెం ఉన్నతమైనవి
కావచ్చు. దానిలో దైవ స్మరణ లేదు. కావున నేను దాన్ని వ్రణ బాధ
అని అంటాను. అంటే మన భక్తి లేక దైవంతో మనకు గల అనురాగ బంధం
ఉండవలసినట్లు లేదని దాని అర్థం. అది ఆశించిన స్థాయి కంటె
తక్కువగ వుంటుంది. అటువంటి బాధకు గల ఏకైక చికిత్స
విషపదార్థాన్ని తొలగించగల శస్త్ర చికిత్స మాత్రమే. దాన్ని
ఉపేక్షిస్తే కాలక్రమంలో అది చికిత్సకు సాధ్యపడని దీర్ఘ కాలపు
వ్రణంగా ఎదగవచ్చు. దుష్టసాంగత్యము,
పరిసరాల ప్రభావంచే మన శరీరంలో పేరుకుపోయిన దైవ వ్యతిరేకము,
ఆధ్యాత్మిక విరుద్ధము అయిన పదార్థామే ఈ విష పదార్థం. పూజ లేక
ధ్యానానికి మనం అనుసరించే పద్ధతులు మన హృదయాలలో నిజమైన ప్రేమను
ప్రదర్శించేవిగా వుండాలనే నిర్ణయానికి అది మనల్ని తీసుకు
వస్తుంది.
దైవప్రేమను పెంపొందించుకోడానికి అనేక మార్గాలున్నాయి.
అందుకు పితృభావం,
మాతృభావం,
మిత్రభావం,
గురుభావం వంటి అనేక భావాలను అనుసరించాలి. కాని నా అభిప్రాయంలో
దైవాన్ని ప్రేయసిగ భావించడం మరింత శ్రేష్ఠము,
అనుకూలము అయిన పద్ధతి. మనలను ప్రేమికునిగాను,
దైవాన్ని ప్రేయసిగాను భావించి,
అదే భావంతో పురోగమించినట్లయితే,
మార్గం మరింత సులభం అవుతుంది. దీనివలన కలిగే ఫలితం ఏమిటంటే
కొంత కాలానికి దైవమే ప్రేమికుడుగాను మనము ప్రేయసిగాను అవుతాం.
నిజానికి ఇదే ధ్యానంలో నాలుగవ దశ. కాని యీ దశలో మనం గమ్యాన్ని
సాధించామనుకుంటే,
అది పెద్దపొరపాటవుతుంది. ముందర యింకా ఎంతో వుంది. కాని అది
మాటలకు అతీతం కావున,
ప్రత్యక్షానుభవానికి మాత్రమే సంబంధించిన విషయం. మరింత
ఆధ్యాత్మిక ప్రగతి కోసం అత్యంత ఉపయోగకరమైన విషయాలను నొక్కి
చెప్పడానికే నేనిదంతా చెప్పాను.
కాని దురదృష్టవశాత్తు అంతిమ సిద్ధి యొక్క ప్రమాణం అదే
కాదు,
పరిపూర్ణత్వపు ప్రమాణం కూడ ఎంతో దిగజారి,
భక్తి చాల చవకబారు విషయంగా పరిణమించింది. అవి వాటి నిజమైన
విలువను పూర్తిగ పోగొట్టుకొన్నాయి. కళ్లను వింతగ కదలించడం కూడ
భక్తిగా పరిగణింపబడుతోంది. దాని ప్రభావం వలన కలిగే అనుభవం ఒక
ఉన్నత సిద్ధిగా భావింపబడుతోంది. ఈనాడు ఒకడు గురువుగ అగుటకు
యిది చాలని నేనర్థం చేసుకున్నాను. కాల పరిస్థితులు మరింత
హీనమై,
మనల్ని ఆ విధంగా మరింత హీనం కావించాయి. క్షీణ దశ ప్రారంభమై
ప్రజల మనస్సులను సరైన మార్గం నుండి పెడత్రోవ పట్టిస్తోంది.
వారు దానివలన సంపూర్ణంగ కళంకితులైనప్పుడు,
అధఃపతన స్థితిలో వారు తప్పును ఒప్పుగ స్వీకరించి,
అదే జీవిత సమస్యలకు సరైన పరిష్కారమని తలచి దానితోనే ముందుకు
వెళ్ళారు. వారు దాన్నే బోధించారు. దాన్ని ప్రకాశవంతమైన
రంగుల్లో చిత్రీకరించి,
ప్రజలకు అందించి తమను స్వీకరించి,
అనుసరించమని ప్రేరేపిస్తారు. వారెవ్వరిలోను కాంతికిరణం అనేది
కనబడలేదు. విచక్షణా జ్ఞానం దాదాపు పూర్తిగా కోల్పోయేటంత మేరకు
నైతిక భావం దిగజారిపోయింది. ద్వేషం ప్రబలి ఆ కారణంగా తీవ్ర
కలహాలను తెచ్చుకోవడం లేక విధ్వంసక సంఘటనలలో పాల్గొనడం అనేది ఒక
పవిత్ర కార్యంగా భావించబడుతోంది. ప్రతిచోట దీని దృష్టాంతాలు
విస్తారంగా కనబడుతున్నాయి. కొందరు ఇష్టదైవం ఉండాలనే భావాన్ని
ప్రతిపాదిస్తారు. ఇతరులు రూపంలేని దైవాన్ని,
ఇంకా మరి కొందరు సుగుణ,
నిర్గుణ దైవ భావాలను ప్రతిపాదిస్తారు. విరోధానికి దారితీసే
తీవ్ర వాదోపవాదాలు ప్రబలినాయి. అవి పరస్పర ద్వేష భావాలను
కలిగించి వివాద కారణాలవుతున్నాయి. సగుణ నిర్గుణభావాలను
సమర్థించేవారు,
తామొకరితో నొకరు పోటీపడుతున్నప్పటికీ,
నా అభిప్రాయంలో,
సమానంగానే పొరపాటు చేస్తున్నారు. అందువలన వారిలో ఏ ఒక్కరూ
లక్ష్యాన్ని పొందలేకున్నారు. వాస్తవానికి ఇవి రెండూ శాశ్వత
సత్వప్రాప్తి అను ఒకే లక్ష్యానికి రెండు మార్గాలు. ఈ
రెండింటికి మధ్యన ఉన్న తేడా ఏమిటన,
సగుణ మార్గాన్ని అనుసరిస్తూ దానికే కట్టుబడి ఉండే వారికి అనంతం
అనేది శాశ్వతంగా వారి దృష్టికి అందకుండ ఉండిపోతుంది. అనగా
వారు గాలిలోని నీటి ఆవిరులను గట్టి మంచుగడ్డగా ఘనీభవింప
చేసారని దానర్థం. ఈ మంచుగడ్ద సముద్రంలోనికి జారిపడినప్పుడు
ఓడలు దాన్ని ఢీకొని మునిగిపోవచ్చు. నిర్గుణ తత్వాన్ని
ప్రబోధించే వ్యక్తి అదే సర్వ సమగ్రమని భావించి దానికే
శాశ్వతంగా అంటి పెట్టుకొని ఉంటే అతడి గతి కూడా అంతే. బహుశా
తేడా అంటూ ఉంటే అది అతడు ఢీకొనే మంచుగడ్డ మరి కొంత దూరంలో
ఉండవచ్చు. నిజంగా చెప్పాలంటే దైవం సగుణుడు కాదు,
నిర్గుణుడు కాదు,
రెండింటికీ అతీతుడు. ఆయన అయనగానే ఉంటాడు. ఈ రహస్య మర్మాన్ని
పరిష్కరించడానికి ఏం చేయాలి?
దానికి ఏకైక పరిష్కారం ఆ పరబ్రహ్మము పైనే,
అది సుగుణం కాని,
నిర్గుణం కాని,
యీ రెండింటిలో ఏదీ కాకున్నా కాని,
మన దృష్టిని స్థిరపరచి దానియందు ప్రేమను పెంపొందించుకోవడమే.
ఇప్పుడు మిగిలి ఉన్న సమస్య సాక్షాత్కార స్థితి మాత్రమే.
సాధారణంగా ప్రజలు దాన్ని శంఖ,
చక్ర,
గద,
పద్మములను నాలుగు చేతుల్లోనూ ధరించిన విష్ణుమూర్తి భౌతిక
రూపాన్ని మానసికంగా దర్శించడమేనని భావిస్తారు. కాని నా
అభిప్రాయంలో అటువంటి దర్శనం ఆరాధకుడి స్థూలతర మానసిక స్థితి
ఫలితమే. అందుకు కారణం అదే రూపాన్ని తీసుకొని ధ్యానించడం వలన
అతడి సూక్ష్మతరమైన ఆత్మే ఆ రూపంలో అతడికి కనపడుతుంది.
రాజయోగంలో సాధనా ఫలితంగా వృద్ధి చెందే మానసిక స్థితి చాలా
భిన్నమైనట్టిది. ఆ స్థితిలో అతడు సర్వత్రా సర్వ విషయాలలోను
దివ్య శక్తి ఉనికిని అనుభూతి చెందుతాడు. నిజమైన దర్శన స్థితి
(లేక దివ్యదృష్టి) అంటే వాస్తవానికి అదే. ప్రజలు దీనిని
విలోకించి,
తమకు తామే దాని అనుభూతిని పొందాలి.
ఈ దర్శన స్థితిని పొందడం అంటే పరిపూర్ణత్వము కాదు. అది
దైవం వైపుకు వేసిన మొదటి అడుగు మాత్రమే. మనం యింకా ఎంత దూరం
వెళ్లవలసి ఉన్నదీ,
యింకా ఎన్ని స్థితులను దాటవలసి వున్నది కచ్ఛితంగ
నిర్ణయించలేము. మన అంతిమ లక్ష్యం ""భూమ''
లేక పరతత్వములో లయం కావడం అయినప్పుడు దర్శన స్థితిని ఏవిధంగాను
పరమావధిగా తీసికోలేము. ఒక విధంగా మనము ప్రవేశించిన స్థితి
ఫలితాలను అనుభవిస్తూ,
యిప్పటికి యింకా ఒక వినోదస్థితిలోనే ఉన్నాము. ఇది ఒక బిడ్డ తన
కొత్త బొమ్మలతో వినోదిస్తున్నట్లు ఉంటుంది. నీ హృదయనేత్రంతో
దీనిని చూస్తే ఇందులోని యదార్థాన్ని తేలికగా గ్రహించవచ్చు.
దీన్ని నేను ""వినోదం''
అంటాను. దానికి కారణం అభ్యాసి దాని నుండి కొంచెం సేపైనా
దూరమైతే దుఃఖం చెందుతాడు. మనలో అనేక మంది ఆరాధనా పరంగా చేసే
దాని వెనుక ఒక భావం ఉంది. దాని ఫలితంగా అది ఒక విధమైన వినోదమే
తప్ప వేరు కాదు. వినోద కారకాలు వివిధ రకాలైనవి ఉన్నాయి.
శిశువుకు బొమ్మలు,
పండితునకు గ్రంథ పఠనం,
ఆరాధకునికి సాధనాభ్యాసాలు,
భక్తునికి భావోద్రేక పూరిత ప్రేమ,
ఆత్మప్రాప్తి పొందినవానికి శాశ్వత సత్వప్రాప్తి,
లయావస్థ;
పరిపూర్ణత్వం పొందినవానికి అతడి అజ్ఞాన స్థితి. కాని యింతవరకు
యివన్నీ వినోదం కొరకు ఉద్దేశించిన వినోదాలు మాత్రమే. నిజమైన
సత్‌తత్వం మనం యీ దశలన్నింటిని దాటినప్పుడు యింకా ముందు
ఉంటుంది. ప్రజలు యీ వినోదాలనే సత్‌తత్వమని భావించి వాటిలోనే
చిక్కుపడి ఉండి తమ అన్వేషణను అంతటితోనే అంతమొందించుకోవడం
శోచనీయము.
పసుపు కొమ్ము లభించిన వాడు తానొక వ్యాపారినని భావించాడట.
సత్‌తత్వం అనేది ఎటువంటిదై ఉంటుందో మాటలలో వివరించడం ఎంతో
కష్టం. అర్థం చేసికొనడానికి దానిని ఆధ్యాత్మిక దశలన్నింటి
యొక్క అంతిమ స్థితిగ చెప్పవచ్చు. ఆ పైన అది కూడ అదృశ్యమై దాని
స్మృతి కూడ వెనుకకు వెళ్లిపోతుంది. అప్పుడు మనము ఒక సమతల
ప్రదేశాన్ని చేరుతాము. అక్కడ మన యీదులాట అనంతంగా
సాగిపోతుంది. ఆ అనంత ప్రదేశం యొక్క అనుభవాన్ని పొందడానికి
ఉత్సాహం చూపే వ్యక్తికి,
అతడు తన భావ ముద్రలన్నింటిని పక్కకు నెట్టిన తరువాతనే అందులోకి
ప్రవేశించాలని నేను చెబుతాను.
నేను పైన చెప్పినదంతా కేవలం స్వీయ ప్రయత్నంతోనే సాధించడం
చాల కష్టం. దానికి కారణం మనం పైపైకి వెడుతున్నప్పుడు ప్రకృతి
శక్తి సూక్ష్మాతిసూక్ష్మంగా అవుతుంది. శక్తి ఎంత ఎక్కువగా
సూక్ష్మమైతే,
అది అంత బలీయమవుతుంది. ఈ దశలో తన స్వీయ శక్తిచే అభ్యాసిని
పైకి నెట్టగల సమర్థుడైన గురువు యొక్క సహాయ సహకారాలు
అత్యంతావశ్యకం. కాని నా దృష్టిలో గురుశక్తితో పైకి
నెట్టబడినప్పటికి,
ఆ గురువు తన శక్తిని ప్రయోగించి అతడక్కడ నిలబడునట్లు చేయక
పోయినట్లయితే మరల క్రిందికి జారిపోయే ప్రమాదం యింకా ఆవిధంగానే
ఉంటుంది. నా సహచరులలో ఒకరిని బ్రహ్మాండమండలం యొక్క నాల్గవ
దశకు అతీతంగా పైకి తీసికొనిపోయి,
స్వయంగా నేనే ఆ స్థితి యందు ప్రవేశించి,
విషయాలను ఒకసారి ప్రత్యక్ష పరిశీలన చేశాను. స్వప్రయత్నంతో ఆ
తరువాత దశను చేరుకోడానికి ఒక వేయి సంవత్సరాల కాలం పడుతుందని
యింకా పైకి వెళ్ళడానికి అయిదు వేల సంవత్సరాలు పట్టునని
తెలుసుకొన్నాను. ఆధ్యాత్మిక దశలు లెక్కలేనన్ని ఉంటాయి.
అందువలన వాటిలో ప్రయాణించుటకు పట్టేకాలాన్ని లెక్కకట్టడానికి
వీలుకాదు. కేవలం ప్రాణాహుతి శక్తి మాత్రమే యీ కాలవ్యవధిని
తగ్గించి వేల సంవత్సరాలు పట్టే గమనాన్ని ఒక జీవిత కాలంలోనే
పూర్తి చేయడానికి వీలు కలిగిస్తుంది. కాని అంతిమ విజయం
నిశ్చయంగా సిద్ధించాలంటే అంతిమ లక్ష్యంకూడా సదా దృష్టియందు
ఉండాలి.
అంతిమ లక్ష్యం దృష్టియందు లేకుండా మన సాధనను
కొనసాగిస్తూపోతే,
మన స్థితి,
గమ్యములేని ప్రయాణీకుని వలె ఉంటుంది. గమ్యాన్ని సదా దృష్టిలో
ఉంచుకున్నప్పుడు మాత్రమే ఆధ్యాత్మిక మార్గాన్ని కనుగొనడం
సాధ్యమవుతుంది.
మార్గములో మనల్ని స్థిరంగా ఉంచేది ఏది?
మనల్ని ముందుకు నెట్టుతూ,
సహాయాన్ని అందిస్తూ చివరి వరకూ నడిపించే ఆ శక్తి ఏది?
అది మన మనస్సు మాత్రమే. దానినే మనం దుష్టమైనదని,
నీచమైనదని తరచు భావిస్తాము. వాస్తవానికి మనమే దానిని అతిగ
కార్యకలాపాలలో పాల్గొనేటట్టుచేసి,
అస్థిరమైన దానినిగాను,
చంచలమైనదిగాను తయారు చేసి దాని అలవాట్లను పాడుచేసినాము.
లేనట్లయితే అది దైవాదేశాలను,
మహోన్నతస్థాయి సూక్ష్మానుభవాలన్నింటిని మనకు అందజేసే
అత్యుత్తమమైన,
అత్యంత ప్రయోజనకరమైన ఏకైక సాధనం. దాని పతన స్థితిలో అది
మనల్ని నిస్సందేహంగా చిత్తభ్రమలకు దారితీస్తుంది. వాటిని మనం
తరచుగా పురోగమన దశలని అపార్థం చేసికొంటాము. అటువంటి
దుస్థితికి గురైన వ్యక్తులను నేనెరుగుదును. అది కూడ
ఆధ్యాత్మికతలో ఎంతోకొంత అభిరుచికల వ్యక్తి అయితే దాని
విషప్రభావ పరిమితిని లెక్క కట్టలేము. అతడు వాటిని
మహాత్ములతోను,
దేవుళ్లతోను గల సంసర్గముగ వివరిస్తూ దివ్యాదేశాలను
పొందుతున్నట్లు చెప్పుకుంటాడు. కాని మనస్సును పరిశుద్ధమైన
స్థితికి తెచ్చినట్లయితే,
అది ఎన్నడూ యీ విధంగా తప్పుదారి పట్టించదు.
మానవ మనస్సు యొక్క మూలాన్ని గురించిన నా స్వీయ
పరిశోధనను మీకు చెప్పెదను. సృష్టి సమయము ఆసన్నమైనప్పుడు
కేంద్రానికి దిగువ ప్రదేశంలో ఒక క్షోభ ఏర్పడింది. అదే
సృష్టికి ఆధారమయింది. అది మొదటిలో పరిపూర్ణస్థితిలో ఉండి,
అది దైవానికి మిక్కిలి దగ్గరగా ఉన్న స్థితి. ఇదే మానవునిలో
మనస్సుగ కనబడింది. దీనికి ఆవల దైవమే ఉన్నాడు. దీనినే నేను
""రాజయోగప్రభావం''లో
కేంద్రమని అన్నాను. ఇప్పుడు మనస్సు దాని ప్రస్తుత స్థితిలో
ఎంతవరకు భ్రష్టుపట్టిందో మీరు ఊహించండి. అది తిరిగి
పరిశుద్ధము కావింపబడి అసలు స్థితికి తీసికొని రాబడినప్పుడు అది
ఏది సరైనదో దానినే బహిర్గతం చేస్తుంది. ప్రాణాహుతిద్వారా
మనస్సును ఒక్కసారిగ దాని మూల స్థితికి తీసుకొని రావచ్చును.
అందుకు అటువంటి మహాప్రజ్ఞుడైన గురువు అదృష్టవశమున మనకు లభించడం
మాత్రమే కాదు,
అభ్యాసి కూడ ప్రాణాహుతి యొక్క తీవ్ర శక్తిని తట్టుకోగలిగిన
వాడై ఉండాలి.
నేను కేవలం కొన్ని ముఖ్యాంశాలను మాత్రమే
ప్రస్తావించాను. ప్రతిచోట ప్రాణాహుతి యొక్క ప్రాముఖ్యతను
నొక్కి చెప్పాను. అందుకు కారణం దీనికన్న మేలైన మరింత
ప్రతిభావంతమైన ప్రగతి కారక విధానాన్ని నేనింతవరకు చూసి వుండలేదు.
గురువుయొక్క మహోన్నత శక్తి మన స్వప్రయత్నంతో కలిసి పురోగమన
శక్తిని ద్విగుణీకృతం చేస్తుంది. ఇంతేగాక యీ విధంగా తన
స్వప్రయత్నం యొక్క ఎరుక అణగివుండి స్థూల యాంత్రిక విధానాలను
ఆచరించేవారిలో కలిగే అహంకార భావాన్ని ఎన్నటికి వృద్ధి చెందకుండ
ఉంచుతుంది. ""రాజయోగ ప్రభావం''లో
నేను సూచించినట్లుగా,
ఇప్పుడు కాలం మారిపోతోంది. అందువలన మన పూజ్య గురువర్యులు
మహాత్మ శ్రీ రామచంద్రజీ ప్రవేశ పెట్టిన విధానాలే ప్రపంచమంతటా
ఆచరణలో ఉంటాయి.
దైవజ్ఞానం ఒక విజ్ఞాన శాస్త్రము. మూల
భాండాగారంనుండి (గ్రంథుల రూపంలో) ప్రవహించు ప్రకృతి శక్తికి
సృష్టి,
విలయాలు రెండింటిని చేయగల సామర్థ్యము కలదు. భారతదేశ ఋషులు
సృజన శక్తిని ఎల్లప్పుడు మానవజాతి పునరుద్ధరణకు
వినియోగించారు. విధ్వంసక శక్తికూడ విస్తారంగ ఉంది. అణుబాంబు
సైతం దీనికి సమానం కాదు. ప్రస్తుతం యీ శక్తి కూడ యిప్పుడున్న
దానికి బదులుగా ఒక కొత్త ప్రపంచాన్ని నిర్మించడానికి
వినియోగించబడుతోంది. ఆధ్యాత్మిక పునరుజ్జీవనం యిప్పటికే
ఆరంభమైంది. మరియు భారతదేశం మళ్ళీ ప్రపంచానికి నాయకత్వం
వహిస్తుంది. దానికి ఎంతకాలం పడుతుందన్న విషయం ముఖ్యం కాదు.
ఆధ్యాత్మికతను ఆధారంగా లేకుండా భూమిపైన ఏ దేశము మనజాలదని
త్వరలోనే ప్రపంచం గ్రహిస్తుంది. రాజకీయ చతురత,
కపటోపాయాల యుగం యిప్పుడు అతి వేగంగా గడచి పోతోంది. ఈ
శతాబ్దాంతంలోగా గుర్తింపదగిన మార్పులు తప్పక రానున్నాయి. ఏది
జరుగవలసిందని విధి నిర్ణయించిందో దానిని ఆనందంగా ఆహ్వానించుటకు
ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉండాలి. అందరు ఆధ్యాత్మిక మార్గానికి
రావలసివుంది. దానివలన మాత్రమే వారికి శ్రేయస్సు నిశ్చయంగా
కలుగుతుంది. నాకీ విషయంలో సేవ చేయడానికి ప్రజలు అవకాశం
కలిగించడంలేదు. అయినప్పటికి వారికి కూడా తెలియకుండానే నేను
వారికి ఎల్లప్పుడూ కొంతవరకు సేవ చేస్తూనే ఉన్నాను.
నేను పైన చెప్పినదంతా నా గురువర్యులు యావత్ప్రపంచానికి
యిచ్చిన సందేశం.
"నేత్రాకారంగల నర్గీస్ పుష్పం తనకు చూపులేదని వేల
సంవత్సరాలుగా విలపిస్తోంది.
ఉద్యానవనంలో నిజమైన నేత్రాలు కలది జన్మించేది చాల అరుదు.'
* * *
|