IMPERIENCE           DRKCV.ORG           SSS           

 
 

Daily Inspiration


What is new


ప్రాణాహుతి సహిత ధ్యానము - గురువు పాత్ర

  

పూజ్య శ్రీ కే.సి.నారాయణ గారు

ఏ సాధనలోనైనాకానీ గురువు గారి ఆవశ్యకత మనకు అర్థ మవుతూనే వుంటుంది సాధారణ ప్రక్రియలలో గానీ, పాఠశాలలో పాఠాలు గానీ, సంగీతములో గానీ, నాట్యములో గానీ, యోగాసనాలు గాని, ధ్యానము గాని, ప్రతి ఒక్కదాన్లోకూడా గురువుగారి పాత్రత, పాత్ర మనం లెక్క పెడుతుంటాము.  కానీ గురువుగారి పాత్రత గురించి అనగా అతని యోగ్యత, అర్హత గురించి గాని తక్కువ మంది ఆలోచిస్తుంటాం.  జీవిత లక్ష్యశ్యుద్ధి గురించిన అవగాహన మనకు వుంటే, గురువు గారి సమర్ధత గురించి ఆలోచించగలిగిన సామర్ధ్యం మనకొస్తుంది. 

ప్రాధమికముగా యిక్కడ, ప్రత్యేకంగా రాజయోగ సాధనలో, బ్రహ్మముతో కానీ,  పరమాత్మతోకానీ లయము కావడం అనేది మన లక్ష్యము అని మాట్లాడుకుంటాం. ఇది వేదాంతపరంగా వుండే మాట. ఎందుకంటే ఆ బ్రహ్మము తెలీదు ఆ పరమాత్మ తెలీదు. ఆ గురువు గారి గురించీ మనకు తెలీదు.  కానీ దాంట్లో ముఖ్యంగా మీరు గమనించ వలసినది ఏమిటంటే పరమాత్మ ఇంద్రియాతీతుడు పరబ్రహ్మ స్వరూపుడు. గురువు గారు కూడా ఇంద్రియములను నిగ్రహించినవాడు. ఇది లేని చోట రాజయోగ సాధనలో మనకు పెద్దగా సహాయం జరుగుతుంది అని అనుకోవడం సాధకుడికి సరి కాదు.  ఎందుకంటే ఆ లక్ష్యశుద్ధి దెబ్బతింటుంది. మనకు ఆ లక్ష్యము  వున్నప్పుడు, మనకు సహాయం చేసేవాడికి అది లేనప్పుడు,  మనకు అది వస్తుందా అన్న ప్రశ్న ఎప్పుడూవస్తుంది. 

లెక్కలు మాస్టారికి లెక్కలు రాకపోతే మనకు లెక్కలు ఏమి నేర్పిస్తాడు? డ్రాయింగ్ నేర్పే మాస్టారికి డ్రాయింగ్ రాకపోతే మనకు డ్రాయింగ్ ఏమి  నేర్పిస్తాడు?  అట్లాగే రాజయోగ సాధనలో యోగ సాధన చేయలేనివాడు మనకు యోగ సాధన ఏమి నేర్పిస్తాడు? ఈ మాత్రం  స్పష్టత వుండాలి మనకు. కానీ ముఖ్య విషయం ఏమిటంటే  ఇంద్రియ నిగ్రహము. దీనికి యమ నియమాలు చెప్పారు.  ఆసన, ప్రాణాయామాలు చెప్పారు, ప్రత్యాహారము అన్నారు, ధారణ అన్నారు, ధ్యానమన్నారు. చాలా ఉన్నాయి. అష్టాంగ యోగంలో చాలా దశలు చెప్పారు. వేదాంతపరంగా కూడా దీనికి కావలసినన్ని నియమాలు చెప్పారు.  ఎట్లా చేయడం అనేది మనకు ఎవరూ చెప్పలేదు. 

అన్నిటికంటే ముఖ్యము ఏమిటంటే మనిషి మనిషిగా మనాలంటే సత్యము, అహింస, ఆస్తేయము, అపరిగ్రహము, బ్రహ్మచర్యము అనే అయిదు లక్షణాలు వుండాలి. అవి వున్న రోజు వాడు మనిషి అవుతాడు. లేకపోతే వాడు నరుడి గానే వుంటాడు. అందరూ నరులే. కాకపోతే మనిషిగా మారాలంటే మాత్రము ఈ లక్షణాలు రావాలి. ఈ లక్షణాలు అంత సులభంగా అబ్బేటట్టు కనపడడంలేదు. చెప్పడానికి చాలా సులభంగా వుంది.  వినడానికి చాలా ఇంపుగా వుంది. రెండూ బాగానే వున్నాయి.  చేసేటప్పుడే వచ్చింది మనకు బాధ.  మరి దాంతో మనమేమి నేర్చుకొన్నామంటే అంచెలంచెలుగా వస్తాయిలే అనే ఒక గ్రహింపుకొచ్చాము. అంటే సాధన పరంగా, ఒక  సమయములో వస్తాయి.  దానికి

 (1) సాధన అనేది కుదరాలి,  (2) మనకు గురువు గారి తోడ్పాటు వుండాలి 

సరిగమ పదనిసలు నాకు రావొచ్చు.  (సంగీత) సంకేతములను నేను వ్రాయవొచ్చు.  నేను పాడవచ్చు కూడా. మీ చేత పాడించడమనేది అంత సులభంకాదు. అది మీరు పాడాలి. మీ ప్రయత్నమనేది ఒకటుంటుంది ఎప్పుడూ. గురువు గారు వుంటారు. గురువు గారే చెప్తారు. కానీ సాధన కుదరాలంటే మనం మాట్లాడాలి.  మన స్వరం మనం సర్దుకోవాలి.  మన ప్రయత్నం మనం చేయాలి. అట్లాగే ఇక్కడ కూడా మనకు కొన్ని ధ్యానపద్దతులు చెప్పడం జరుగుతుంది  ఈ సిద్ధాంతంలో. దాన్ని పాటించడం అనేది మీరు చేయాలని అంటాము. 

సరిగమ పదనిసలు నేర్చుకోవచ్చు, Algebra నేర్చుకోవచ్చు. Calculus నేర్చుకోవచ్చు.  బొమ్మలు/చిత్రములు వేయవచ్చు. పరిగెత్తవచ్చు. ఎవరి సామర్ధ్యమును బట్టి వాళ్ళు చేస్తారు. అభ్యాసము/సాధన ఏదైనాకానీ చేయవచ్చు. కొన్ని భౌతికమైన విషయాలు, కొన్ని మానసికమైన విషయాలు. సాధనలు అవీ తీసుకొంటే భౌతికంగా కొన్ని, మానసికంగా కొన్ని. ఆసనం వేసేయవచ్చు సులభంగానే.  ఎందుకంటే శారీరకమైన కసరత్తు అది. ధారణ కుదరాలంటే, మనస్సు కుదరాలి కదా. అక్కడికొచ్చేసరికి విషయము మారి పోయింది. మన చేతుల్లో లేదు అది. ఈ ఆలోచనలు అనేవి మన చేతుల్లో లేవు. ఇష్టప్రకారం తిరుగుతుంటాయి అవి. ఒకటి ఆలోచిస్తే ఇంకోటి తేలుతుంది. ఇది సరి అయితే అది ఎందుకు కాదంటుంది. 

మనస్సును మనం నాలుగు విధాలుగా విశ్లేషించవచ్చు. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఇలా విశ్లేషించవచ్చు, కాకపోతే ఈ మానసిక స్థితులు ఏమిటి? మనస్సుకు చంచలత్వము వుంటుంది. బుద్ధికీ చంచలత్వము వుంటుంది. అహంకారమునకీ చంచలత్వము వుంటుంది. సాధారణంగా మనస్సుకు సంబంధించినవన్నీ కూడా మనో వికారములు అనలేము కానీ వాటిని మానసిక వికారాలనాలి. అంటే మనయొక్క భావోద్వేగపూరిత స్థితులు అవి. 

బుద్ధికి వచ్చేవి చూశారా అవి మేధస్సు సంబంధించినవిమాత్రమే వస్తాయి. ఒక సమస్య, చదరంగపు ఆటలో కావచ్చు, హాకీలో సమస్య కావచ్చు, Computer సమస్య కావచ్చు, లెక్కల్లో సమస్య కావచ్చు. ఏదైనా కానీ సమస్య అంటూ ఒకటి వస్తే దానికి పరిష్కారము ఏమిటి అని ఆలోచించేది బుద్ధి.

మనస్సు అనేది నేనిటు పోవాలా? అటు పోవాలా? ఈ రోజు నేను  వీళ్ళతో తిరగాలా, వాళ్ళతో తిరగాలా? మనకు ఈ చొక్కాయి బాగుంటుందా? ఆ చొక్కాయి బాగుంటుందా? అనేవి మానసిక లక్షణాలు.

ఈ రెండు కానిది అహంకారము. నేను అక్కడకు పోతే నా గౌరవం నాకుంటుందా, నేను తక్కువగా వుండాలా?, నాకు పాఠాలు వాళ్ళు చెప్తారా? నేను వాళ్ళతో మాట్లాడవచ్చా? వ్యక్తిగతంగా వుండవచ్చా శిక్షణా కార్యకమంలో? లేకపోతే నేను  వినాల్నా? వాళ్ళుచెప్పాల్నా అనే ఒక మాట మనస్సులో  వుంటుంది. ఇది అహంకారానికి సంబంధించిన విషయము. ఇది ఒక స్థాయి వరకే మనము తీసుకొని వెళతాం. ఆ స్థాయి దాటింది అనుకోండి మీకు కోపం వచ్చేస్తుంది. ఏమిటయ్యా ఊర్కే మాట్లాడుతున్నావు. కథలు చెప్తున్నావు అంటారు. అహంకారము అనేది ఒకటుంటుంది. ప్రతీ ఒక్క చర్య వెనుక. ఈ మూడు కూడా అస్తమానము యిరుకులు కలిగిస్తూనే వుంటాయి. ఇవన్నీ కలిపి చిత్తము అని మనకు వస్తుంది. అంటే వీటన్నిటి మిశ్రమ కలయిక మొత్తము, ఈ చిత్ అనేదానికి, మొత్తమయి యివన్నీ కలిసి వస్తాయి. ఈ చిత్ ని మనము నియంత్రించాలి. 

చిత్తవృత్తినిరోధం యోగం అని పతంజలి చెప్పారు.  అంటే ఏమిటి? ఏ వృత్తి తగ్గించాలి దీంట్లో? తగ్గేటట్లు ఏమీ లేవు కదా! ఒకటిగా తగ్గేటట్లుగా కనపడడం లేదు. ఇక్కడకు వచ్చాం. ఏదో యిక్కడ పాఠాలు చెబుతున్నారు వీళ్ళు. రాజయోగం గూర్చి చెప్తామన్నారు.   వచ్చాము.  వీళ్ళేం చెప్తారు? మీరు యిక్కడ కూర్చొని నాతో వింటున్నాకానీ, ఈయన చెప్పేదేదో వేరేగా వుందే, మొన్న ఆ శిక్షణా తరగతి లో అట్లా విన్నామే? ఈ పుస్తకంలో ఇట్లా వుంది కదా!  మా పెద్దవాళ్ళు యిట్లా చెప్పారు కదా! ఏకకాలమందు మీ తలకాయలో ఈ ఆలోచనలు పరుగెడుతూ  ఉంటాయి.  నేను మాట్లాడుతుండగానే ఈ ఆలోచనలు మీ మనస్సులో వుంటాయి. ఈ నాటకము జరుగుతూనే వుంటుంది. దీన్ని నియంత్రణ చేయాలి. నియంత్రణ చేసి ఒక చోటకు తీసుకురావాలి. ఏకాగ్రవృత్తికి తీసుకొని రావాలి. 

మన మనస్సు యిప్పుడు ఎటువంటి స్థితిలో వుంది? క్షిప్తమైన స్థితిలో వుంది.  మరి కొద్దిసేపు వినడం తర్వాత ఒక ప్రత్యేకమైన ధ్వనికి అలవాటు పడితే, నా మాట బాగున్నా, బాగా లేకపోయినా, కంట్లో మీకు నిద్ర వస్తుంది.  మీరు ఎవరి వుపన్యాసమైనా విన్నారంటే, కొద్దిసేపయిన తర్వాత మనస్సు నిద్రపోతానంటుంది. అలా మందబుద్ధితనము వస్తుంది. అప్పుడు మూఢానికి తప్పుకొంటాం మనము. క్షిప్తమైన మనస్సు మూఢమవుతుంది. సాధారణంగా మనకు మత్తుగా వున్నట్లు అనిపిస్తుంది. ఇప్పుడు భోజనం చేసి వచ్చి కూర్చుంటే ఇంకా ఎక్కువగానే వుంటుంది, ఇవి భౌతిక విషయాలు కాబట్టి. భోజనం చేసాం కాబట్టి, మనయొక్క శక్తి, రక్త ప్రసరణ  అంతాకూడా stomachకి వస్తాయి కాబట్టి, బుర్రకు కాస్తవుండదు కాబట్టి నిద్ర వస్తుంది. తప్పదు. అందుకనే మనము మితాహారము అంటాం. మితాహారము పెట్టుకొంటేనే వాడు యోగిగా వుండగలుగుతాడు. ఎక్కువగా తినేస్తే వాడు యోగసాధన చేయలేడు. వాడి వల్లకాదు. నిద్రపోతాడు. నిద్రపోయి నేను సమాధిలో వున్నాననుకొన్నా తప్పు లేదు. వుండొచ్చు, అనుకోవచ్చు. అట్లా అనుకొనేవాళ్ళు కూడా చాలామందివున్నారు. రకరకాలు వుంటారు మనుషులు. అధి మూఢము.  మూఢము అయిన తర్వాత విక్షిప్తము అనేదానికి పోతారు. అంటే ఈ శిక్షణా తరగతుల గూర్చి అనుకోవడమో లేక భగవంతుడి గూర్చి అనుకోవడమో, వేరే వేరే ఆలోచనలు వుంటాయి. దానికి సంబంధించినవి కాని సూటిగా  దాంట్లో వుండదు. తర్వాత ఏకాగ్రత వస్తుంది. ఆ విషయము పైన మనస్సు లగ్నము అయ్యింది అనుకోవచ్చు.  తర్వాత మీకు సమాధాన్  వస్తుంది.  ఈ స్థితులన్నీ రావాలి మనకు. 

ఈ కడపటి రెండు స్థితులలో ఏవి వచ్చినాకానీ సంతోషమే. ఏకాగ్రవృత్తి కానీ లేకపోతే సమాధాన్ కానీ.  మనకుండే ఆ మొదటి  మూడు స్థితులు, వాటి నుంచి బయట పడాలి. ఎట్లా బయట పడాలి? ఏవి అడ్డుపడుతున్నాయి? లెక్కతీసుకొంటే ఒకటి మనం అందరము పశువులము. పశువు కానివాడు లేడు. అందరమూ పశువులమే. పశుప్రవృత్తి అనేది మనతో వుంటుంది. ఆకలి, దప్పిక, తర్వాత మూడోది సంతానోత్పత్తి కోరిక.  ఈ మూడూ జీవి లక్షణాలు. పశు లక్షణాలు. అన్ని పశువులకు ఉన్నాయి. మనకూ ఉన్నాయి. దీన్ని నియంత్రణ చేయాలి. ఆలోచనలు అన్నీ దీని గూర్చే వుంటాయి.  ఈ ఆలోచనలు వచ్చినపుడు, ఉద్యోగ వ్యాపారముల గురించి అనగా మొదటి దాని పైనే వున్నాము. అనగా తిండి గురించి. తిండి కావాలి కాబట్టి ఉద్యోగం కావాలి. ఉద్యోగం కావాలి కాబట్టి విద్య కావాలి. ఇదంతా దానికి (తిండికి) సంబంధించిన విషయము.  దానికి మించి విషయము వేరే ఏమీ లేదు. అందుకే మనము చెప్పేది ఏమిటంటే ఇవన్నీ కూడా కూటి కొరకే. కోటి విద్యలు కూటి కొరకే నాయనా అన్నారు. వేరే చింత లేదు దీనిలో. మనమేదో పొడిచేస్తాం అనుకుంటే పొడిచేదేమి లేదు మనము. చేసేది యిది. ఎవరైనా కానీ, ఎందుకైనా కానీ, వాడు పరిశోధన ఎందుకు చేసినా కానీ, కడపటికి వాడికి జీతం ఇచ్చారు. ఇదంతా వాడి తిండి కోసమే.  ఇంతే విషయము. అంటే ఈ మూడే మనల్ని, మన ఆలోచనలనీ కూడా ప్రభావితము చేస్తాయి. 

దీన్ని నియంత్రణ చేయాలి అన్నప్పుడు ధ్యాన పద్ధతి ఒకటి చెప్పారు.  ఇంకా మరియూ బి బిందువుల పైన ధ్యానము గురించి ఒకరు మాట్లాడుతారు. వారు మీకు వాటి గురించి విశదపరుస్తారు.

దీనిని చేయడం వలన మీరు చేయవలసిన పనిని మీరు చేయగలుగుతారు. కానీ గడచిన 5 లేక 6 వేల సంవత్సరముల చరిత్ర మనము చూసుకొంటే, సాధన చేసిన వాళ్ళెంతమందైనా కానీ, ఇవి తేలలేదు. సంవత్సరాల తడబడి ఈ కుస్తీ పడుతూనే వున్నారు. ఒళ్ళు కుదరటంలేదని కానీ, మనస్సు కుదరటంలేదని కానీ, చిత్తం కుదరటం లేదని కానీ,  ఏదో నానా రకముల బాధలు.

ఈ రోజు నా మానసికస్థితి  సరిపోలేదు. ఏమి చేయాలో అర్థం కావడం లేదు. ఒక పక్క ధ్యానం చేయాలని తెలుసు. ఒక పక్క భగవంతుడిని గూర్చి అనుకోవాలని తెలుసు,  కానీ జరగట్లేదు. కారణం ఏమిటంటే? కారణం ఏమిలేదు. కానీ వెయ్యి కారణాలు చెబుతాము. అన్నీ ఈ మూడింటికి సంబంధించినవే.  ఈ ప్రపంచంలో, ఇలలో, ఈ మూడు విషయములు తప్పితే వేరే లేవు, ప్రపంచంలో వేరే ఆలోచన వచ్చి, నాకు వేరే పని వుందని చెప్పగలిగే తలకాయ చెడిపోయిన వాడు ఎవరూ లేరు. 

సర్వసాధారణ మయిన ఇబ్బందులు ఇవి. ఇవి దాటిన ఒకరిద్దరు ఎవరైనా వుంటే, వాళ్ళు చాలా పెద్దవాళ్ళు. వాళ్ళతో మనకు పోలిక  లేదు, వద్దు. పెద్దవాళ్ళని పెద్దవాళ్ళగా వుండనివ్వడం ఉత్తమోత్తమం. సర్వ సామాన్యంగా మనకు ఉండే సమస్యలు ఇవి. దీన్ని ఎట్లా సర్దుబాటు చేయాలి అని? ఎందుకంటే ఈ సాధనా పద్దతి వుంది చూశారా, ఇది సామాన్య మానవులకొరకే. ఎవరో వెళ్ళిపోయి అడవిలో వుండిపోతాము అనేవాడికి కానీ, ఎవరితోను ఏ సంబంధం లేకుండా వచ్చేసిన వాడికి కానీ కాదు. ఇక్కడ వుండి బతికి, ఇతరులతో కూడా వుంటూ సావాసం చేస్తూ యోగం కూడా చేయాలన్నవాడికి ఈ పద్ధతి. అంటే అందరికీ పనికి వచ్చే దాని మీద మాట్లాడుతున్నామే కానీ వ్యక్తిగతంగా, చాలా ఉత్కృష్టమైన మనుషులు వుండి, ఉదాత్తమైన సంస్కారం వున్నవాడెవడైనా వుంటే వాళ్ళ గురించి మనం మాట్లాడటం లేదిక్కడ. వాళ్ళకిది  ఉపయోగపడేది కాదా అంటే, వాళ్ళకు కూడా ఉపయోగపడేది అవుతుంది.. కానీ దాన్ని గురించి మనం మాట్లాడుకోము.   ఇక్కడ మాట్లాడుకోవలసిన అవసరం లేదు.

ఈ మూడు విషయములు గూర్చి మనకు చెప్పారు.

ఒకటేమో, మరియూబి బిందువుల మీద ధ్యానము గూర్చి మనయొక్క స్వానుభవం చెప్పాము. రెండవది, పుస్తకాలు వ్రాసాము. మూడవది, ధ్యానము గూర్చి  చెప్పాము. ఇవన్నీ కాకుండా ఇంకోటి ఉంది. అది గురువుగారి సహాయము, తోడ్పాటు. ఇక్కడ సరిగమపదనిసలు చెప్పడం కాదు. పాఠాలు చెప్పేసి, నీ అభ్యాసము నీవు చేసుకోమని చెప్పడంతో ఆగిపోదు బండి. నువ్వు అభ్యాసము చేయలేని పక్షంలో నీ తరఫున నీ పక్కన కూర్చుంటూ నీ అభ్యాసమును చేయించగలిగిన ఒక గురువుగారి తోడ్పాటు అనేది యిక్కడ వుంది. ఇది వీలుపడుతుందా? నాతో కూడా మా గురువుగారు ఎప్పుడూ ఎట్లా వుంటారు? భౌతికంగా ఉండలేరు.  ఉంటే ఏ ఒక్కరి దగ్గరనో ఉండగలుగుతారు. మిగతావాళ్ళదగ్గర ఉండలేరు కదా! ఒకే సమయంలో అందరి అందుబాటులో ఉండడం వీలుపడుతుందా? వీలుపడుతుంది. ఎట్లాగు? భగవంతుడి స్వరూపము అందరిలో ఉంది కాబట్టి. భగవంతుడు మన హృదయంలో ఉంటాడు కాబట్టి. అందరికి గురువు ఆయనే కాబట్టి. జగద్గురువు ఆయనే. పరమాత్మే జగద్గురువు. ఇంకెవరైనా జగద్గురువు అనుకొంటే అది వాడి భ్రమ. తప్పు లేదు. ఎవరి భ్రమ వారిది. మన భ్రమ మనది. వాడి భ్రమ వాడిది. దాంట్లో ఏముంది? కానీ నిజం కాదు. తప్పు లేదనడంలో, ఆయన భావనలో తప్పు లేదు అనుకోవడం ఉద్దేశ్యమే కానీ అది సరి అయినది అని నేను చెప్పడం లేదు. పరమాత్మ అందరికీ జగద్గురువు. సరే ఒప్పుకొన్నానయ్యా. మరి ఆ పరమాత్మనాకు ఎట్లాతోడ్పడతాడు?

అందరిలో ఉన్నాడు కదా!

ఇన్ని రోజులు తోడ్పడనివాడు ఇప్పుడు ఎట్లా తోడ్పడతాడు అది చెప్పు నాకు. అది నీ ప్రశ్న. అర్థమయింది. అది నిజమే. ఎట్లా తోడ్పడతాడు? ఇన్ని రోజులు తోడ్పడుతూనే వున్నాడు. కాని వినపడడం లేదు నీకు. దాన్ని నీకు వినిపించేటట్టు చేయడం మా పని.  ఎవరు చేస్తారు ఈ పని ? ఎందుకు చేస్తారు?

ఎవరు చేస్తారు? ఎందుకు చేస్తారు?

చేయడం ఒక సహృదయుడైన సహోదరుడు, తన ధర్మము కాబట్టి చేస్తాడు. ఎందుకు చేస్తాడంటే సహృదయంతో చేస్తాడు. ఫలాపేక్ష ఏమీ లేదు. ఎందుకంటే నాలో ఏ గురువు అయితే నాకు కనపడుతున్నాడో అదే గురువు నీకు కనపడాలి. అప్పుడు నిజమైన సహోదరులము. లేనినాడు ఉట్టి మాటలు. ఏం సోదరా బాగున్నావా అనేసేసి రోడ్డులో పలకరించడం వేరే. నిజంగా సోదరుడు అనుకొన్న భావనతో నీ ఆధ్యాత్మిక పురోగతికి తోడ్పడము వేరే. మిగతా విషయాల్లో తోడ్పడవచ్చు. నీ ఆర్థిక పరిస్థితి బాగుంటే ఇతరులకు సహాయం చేయడం నీ వంతు వుంటుంది. అది నీ యొక్క స్థితి గతులను బట్టి వుంటుంది. ఇది ఎవరి స్థితి గతుల పైన కూడా ఆధారపడి లేదు. ప్రతి ఒక్కరు నిస్వార్థంగా ఎటువంటి కష్టము లేకుండా చేయగలిగిన పని యిది ఒక్కటి. ఎందుకంటే ఈ ధనము ఉంది చూసారా. అది నిధనము. నిధనము శ్రేయ: నిధనము యిది. మన లోపల నిగూఢమైన ధనము ఒకటుంది. 

అది పరమాత్ముడు. దీన్ని అందరితో పాలు పంచుకోవచ్చు మనము. మంచి అనేది ఎప్పుడూ పంచుకోవచ్చు. కానీ ఒక వస్తువు పంచుకోవడమంటే? భౌతికంగా పంచు కోవాలి అంటే కూడా, అది నీ చేత వుంటేనే, పంచుకోగలుగుతావు. భోజనం వుంటే రెండు రొట్టెలుంటే ఒక రొట్టె ఇచ్చేయవచ్చు. ఒక రొట్టె వుంటే ఆ రొట్టె కూడ ఇచ్చేయవచ్చు.  ఆ రొట్టే లేకపొతే? అటువంటి లేని పరిస్థితి అనేది కలుగదు ఇక్కడ. ఈ ఆధ్యాత్మిక ధనము ఏదయితే వుందో, పరమాత్మ ఏదయితే వుందో అది అందరితో కూడా   కలిసి పంచుకోవచ్చు. ఈ మూలాధారమైన అంశము మీద నొక్కి వక్కాణము చేద్దామనే ఉద్దేశ్యంతోనే మీకు ధ్యానం చేసేటప్పుడు హృదయములో దివ్యజ్యోతి పైన  ధ్యానము చేయమంటాము. 

పరమాత్మ నీలో దివ్యజ్యోతిగా వున్నాడు అనే దాని పైనే    ధ్యానము చేయవయ్యా, అది నిజము, అది ఎప్పటికైనా నీకు తెలిసివస్తుంది అనే అంశము మీద ఒత్తిడి చేస్తూవుంటాం. కానీ అది అంత సులభంగా కనపడడం లేదు. తోడ్పాటు కావాల్సొస్తుంది. దీన్లో మీకు కావలసినటువంటి అవగాహన ఎందుకు కుదరటం లేదనే దానిపైన ఇంతకు ముందే చెప్పాము.  మీ చిత్తవృత్తి  అటువంటిది అని. అవగాహన కుదరటం లేదు కాబట్టి. కుదిరేటట్టు చేసుకోవాలి. నేను దీన్ని వదిలించుకోవాలి. ఈ బాధలు వదిలించు కోవాలి. నా వల్ల కాదు అనుకొన్నప్పుడు  రెండు  వున్నాయి.  ఈ సంస్కారములు, ఈ బంధములు ఎట్లా కలిగినాయి మీకు?. ఈ యిడ్లీయే కావాలనో, ఈ చపాతీయే కావాలనో, ఈ సినిమాకే పోవాలనో, ఆవిడేదో పుస్తకం రాసింది అదే చదవాలనో లేకపోతే అక్కడ పోయి ఆ ఉపన్యాసము విందామనో లేకపోతే ఈ ఉద్యోగానికి మనము దరఖాస్తు  చేయాలనే భావన మీకు ఎందుకు కలుగుతుందంటే, దాన్ని గురించి మీరు మీ మనస్సుని కేంద్రీకరించారు కాబట్టి. మీరు దానిపైన మనస్సు లగ్నం చేసారు కాబట్టి మీ మనసు లో ముద్రపడి దాని వెంట పడుతున్నారు మీరు. అంటే యిది ఎవరివలన వచ్చినది? భగవంతుడు యిచ్చినది కాదు యిది.  నీకు నీవే సంపాదించుకొన్నది. నీ సంస్కారములకు నీవే భాథ్యుడవు. సాధారణంగా మన సిద్దాంతం గురించి మాట్లాడినపుడు,  హిందూ సిద్దాంతం గురించి మాట్లాడినపుడు, కర్మకు చాల వ్యతిరేక అర్థాలు ఇస్తారు. కర్మ అనేది నీవు చేసిన దానికి ఫలమే కానీ, భగవంతుడు నీ కర్మంటూ నీకు ఏమీ యివ్వలేదు. మనకు మనం చేసుకొన్న స్వయంకృత అపరాధమో, స్వయంకృత వుపకారమో మీ యిష్టం ఏదైనా అనుకోండి. మన స్వయంకృతమే. మనం చేసుకొన్నవే. ఈ మనము చేసుకొన్నవే అన్న అవగాహన కనుక కలిగితే, బాగా కుదిరితే, మనమే వదిలించుకొంటాము అనే ఒక దాని పైన కూడా ధృడమైన సంకల్పము కుదురుతుంది. ఏ సంకల్పబలముతో మీరు దాన్ని తెచ్చుకొన్నారో అదే సంకల్పబలముతో దానిని వదిలించుకొనవచ్చు.

ఒక అలవాటు  కానీ, ఆ విషయానికి  వస్తే చాలా అలవాట్లు, అన్నీకూడా మనం పెట్టుకొన్నవే. మనం వదిలించుకొంటే ఎప్పుడైనా వదిలించుకొనవచ్చు. నీకు ఏ అలవాటు కూడా భగవంతుడు నీ తలకాయ పైన రుద్దలేదు కదా!. ఏ యితరులు కూడా మీ పైన రుద్దలేదు కదా! మీకు మీరే తెచ్చు కొన్నది. మీకు మీరే వదిలించుకోండి. ఈ సంకల్పబలము మీకు కావాలి. నిజమే సార్, నాకు ఆ సంకల్పం వుంది. కానీ నా సంకల్పం నిర్వీర్యమైనది. దానికి నా వల్ల కావటం లేదు. చాలా గట్టిగా వుంది. ఏం చేయాలి? అన్నప్పుడు ఇటువంటి కర్మఫలాన్ని ఎట్లైతే అనుభవిస్తుంటారో, మీ యొక్క సంస్కారఫలాన్ని ఎట్లైతే అనుభవిస్తుంటారో దాన్ని వదిలించుకోవాలి అనే సంకల్పము చేత మీరు క్షాళన అనేది చేయండి అని క్షాళనాపద్ధతి మన ఈ సిద్ధాంతంలో  ప్రత్యేకంగా ప్రతిపాదించ బడినది. 

సాధారణంగా దీన్ని గూర్చి ఎక్కువగా ఎవరూ మాట్లాడరు  మన సంకల్పము చేత వచ్చింది దీన్ని వదిలించు కోవాలి. అట్లా కాకుండా సూటిగా మనం ఏమంటాము?  భగవంతుడా ఇది నాకు వచ్చింది. వదిలించేసేయ్ అంటాం. వచ్చినది ఆయనేం చేయలేదు కాబట్టి ఆయన నాకు సంబంధం లేదు పొమ్మంటాడు. నీ కర్మ అది, నువ్వు అనుభవించు అంటాడు. నాకు సంభంధం ఏంటి?  ఎందుకంటే ఆయన సమవర్తి. సమవర్తి ఎప్పుడూ. కారణము-ఫలితము సరిగా వెళ్ళిపోతుంది అంతే. అది మారదు. దాన్లో మార్పుకు అవకాశంలేదు సమవర్తికి. గురువుగారు సమవర్తి కాడు. గురువుగారు ఎప్పుడూ కూడా ఆశ్రితపక్షపాతుడు. ఎవరు తన సహాయం కోరుతాడో, వాడికి సహాయం చేస్తాడు.  గురువు అనేది ఒప్పుకొంటే సహాయం అనేది జరుగుతుంది. ఎందుకంటే అక్కడ గురువు, సహృదయంతో సహోదరుడుగా వుంటాడు. 

జగద్గురువు అయితే పైన వుంటాడు చూసారా, ఆయన సమవర్తి.  ఆయన దగ్గర మాట్లేడేదానికి ఏమీ లేదు. ఇక్కడ ఎవడైనా సహోదరుడు కానీ దొరికినాడంటే, మనకు సహాయం చేస్తానంటే, వాడు వుపయోగ పడతాడు మనకు.  ఎట్లా వుపయోగపడతాడు? మీ యొక్క సంకల్ప బలము చేత మీరెట్లాగయితే దాన్ని వదిలించుకోవాలని అనుకొంటున్నారో దానికి తన యొక్క సంకల్ప బలాన్ని కూడా తోడ్పాటు చేస్తాడు. సరే ఎందుకు చేస్తాడు ఈ సేవ? ఫలాపేక్షతో చేసినపుడు దానికి ఫలితం వుండదు. ఎందుకంటే ఏ ఫలాపేక్ష చేసినా కానీ అది భగవంతుడి కార్యం కాదు. ఎందుకంటే అది యింకొకరి కార్యం అవుతుంది. భగవంతుడు మనకు మొదటినుంచీ చెప్పించింది ఏమిటంటే నీకు కర్తృత్వభావన వుండకూడదయ్యా! నీ కర్తృత్వభావన నీవు కనుక తీసేసుకోగలిగితే నీకు ముక్తి  ముట్టినట్లే అంటాడు భగవద్గీతలో. 

కర్తృత్వభావన -నేను చేస్తున్నాను అనే మూర్ఖత మానేసి, భగవంతుడే చేస్తున్నాడు అనే భావము కనుక వస్తే నీకు ఈ బంధములు వుండవు. దీన్ని సులభముగా  వదిలించు కోవచ్చు అనేది భగవద్గీతలో చెప్పబడింది. ఈ సిద్ధాంతంలో కూడా అదే ప్రతిపాదించబడినది. బాబూజీ సిద్ధాంతంలో కూడా అదే అంటాము. నీకు సంస్కారములు అంటకూడదు అనుకొంటే మాత్రము చేసే పనంతా కూడా భగవంతుడే చేస్తున్నాడు అనే ఒక భావంతో చేయండి అంటాం.  లేదు నాకు సంస్కారములే కావలెను యింకా కొన్ని కావాలి అనుకొన్నవాడు అటువంటి భావంతో పనిచేస్తే పనికిరాదు. దీని వెనుక ఏమనుకొంటున్నాము అంటే సంస్కారములు అంటరాదు మనకు. మనము పద్మపత్రమివాంభస, అనే ఒక సూత్రము తో. తామరాకు పైన నీటిబొట్టు వలె మనము వుండాలి, అనే ఒక భావనకు  మనం వచ్చివుంటే యిది చెల్లుతుంది. సాధనలో మొదటి మెట్టులోనే అది వీలు పడుతుందా?  వీలుపడదు. మొదట్లో వీలుపడదు. సంస్కారములు కొంత త్యజించిన తర్వాత, సంస్కారములు కొంత తగ్గిన తర్వాత ఆ యొక్క తేలికదనము ఏదైతే మనము  అనుభవిస్తామో,  మనకు మనముగా ఎప్పుడైతే తేలికతనాన్ని మనం అనుభవిస్తామో అప్పుడు అనుకొంటాం మొత్తం వదిలించుకొందామని.  మొదట్లోనే  ఎందుకు వదిలించుకొంటాడు? ఆరంభము చేస్తాం అంతే. ఓ మంచితనంతో పెద్దవాడెవడో చెప్పాడంటే వింటాం కాని వదిలించుకోము. 

అసలు నిజమైన విషయం చెప్పాలంటే,  ఇంకా నాలుగు కావాలనే వుద్దేశ్యంతోనే గుడికి పోయేది. గుడికంటూ పోతే, దేవుడి గూర్చి అనుకొంటే మనకింకేమైనా వస్తుందేమోనని. అయ్యా! నా కిది యిప్పించు. అయ్యా! అది నాకిప్పించు. అయ్యా! మావాడికిది ఇప్పించు అనేదానితోనే ప్రార్థన మనం మొదలెడతాం. ప్రార్థన అంటూ ఎవరూ కూడా నాకు వున్న సంస్కారములు తీసేసి నీలో ఐక్యం అయిపోతాము అని చెప్పుకొన్నవాడు ఎవడూ కూడా నాకు తెలిసి మొదటి మెట్టులో వుండడు. మొదటి మెట్టులో అటువంటి అవకాశము లేదు. ఎక్కడో ఒక శుకబ్రహ్మ దొరికినాడట వాళ్ళకి .మన పురాణాల్లో ఒక పేరు వుంది. శుకబ్రహ్మ ఒక్కడే పుట్టుకతోనే అటువంటి భావముతో వున్నాడని. ఇంకెవరికీ చెప్పలేదు. వ్యాసుడికి చెప్పలేదు, ఎవరికీ చెప్పలేదు. ఆయన ఒకడికే చెప్పాడు. సరే ఆ ముచ్చట అవసరం లేదిక్కడ. ఇప్పుడు మనకు ఈ సంస్కార ఫలములు పోవాలనుకొన్న తోడ్పాటులో నీ యొక్క సంకల్పము పనిచేయాలి. నీ సంకల్పానికి యింకొకరి సంకల్పము తోడ్పడాలి. అలా తోడ్పడే వ్యక్తికి స్వలాభాపేక్ష వుండకూడదు. ఏ వుద్దేశ్యం లేకుండా పూర్తిగా భగవత్ కైంకర్యముతో నీకు సహాయము చేసిననాడు తప్పకుండా అది కూడా నీ యొక్క సంకల్పముతో కలుస్తుంది. లేనినాడు ఈ రెండు సంకల్పములు కొట్టుకొంటాయి.  అది గురు శిష్యుల కథలలోనివి. గురు శిష్యుల కథలు కొత్తవేంకావు. దాని గురించి అనవసరమయిన వ్యాఖ్యానము. గురు శిష్యులము అయిపోతాము. గురు శిష్యులు అయ్యే అవసరం లేదిక్కడ. 

ఇద్దరూ సహోదరులే. ఇద్దరు అన్నదమ్ములు. నీ యొక్క సాధన నీవు చేస్తూవుంటే యింకొకరి తోడ్పాటు అనేది కావాలి. ఈ తోడ్పాటు వెనకల ఎటువంటి స్వార్ధబుధ్ధి వుండకూడదు.  అతనికి వేరే బుధ్ధి లేకుండా, నీకు సహాయము చేయాలనే బుధ్ధి తోనే చేయాలి. ఎందుకు చేయాలి అనంటే? ఒక సహోదరుడికి యిది చేయాలి. చేయగలుగుతాడా? ఆ సంకల్పం నాకు నిజంగానే పనిచేస్తుందా? సాధారణంగా మన గణాంక విధానములో లెక్కెట్టుకొన్నాగానీ ఒక సంకల్పానికి, రెండు సంకల్పములు, సహజంగా బలవత్తరమైనవి  అనే ఒక  భావన  అది. అది కాదిక్కడ మన వుద్దేశ్యము. ఈ సంకల్పానికి వెనకాల భగవంతుడి సంకల్పం ఒకటుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితులలో కేంద్రం,  ఏదయితే మనం, భూ, భూమాతా, లేకపోతే భూమ లేక అంతకంటే శక్తి , లేకపోతే అంతకంటే గురువు అని అనుకొంటామో, ఆ కేంద్రమేదయితే వుందో, మనందరికీ పెద్ద కేంద్రము అది.  అక్కడి నుంచే మనము వచ్చాము. ఎప్పుడయితే యివి చాలా గతి తప్పడం జరిగి, స్వార్థము పెరిగి ఒక విధమైన  దు:ఖముతో వున్నారు యిప్పుడు మనుషులు. జీవితంలో సంతోషము లేనిస్థితివుంది. ఎంత ఉన్నా కానీ అసంతృప్తి వుండిపోయింది. భగవంతుని నిర్ణయము-ఆజ్ఞ (Dictum of God) ఏమిటి? అందరూకూడా సంతోషముగా వుండాలనేది భగవంతుడి యిచ్చ. ఈ సృష్టి కల్పనకి కారణం అందరూ సంతోషంగా వుండాలనే కానీ, అందరూ కష్టపడిపోయి మహా బాధపడి పొమ్మని భగవంతుడి వుద్దేశ్యం కాదు. ఏ తండ్రి యొక్క వుద్దేశ్యం అది కాదు. అలా అనుకోవడం ఒక రోగం. అంతే. ఒక వ్యాథి. కొందరికి వుంది. దాన్ని వదిలించుకోవలసిన బాధ్యత వాళ్ళకుంది. దానికి తోడ్పాటు చేయవలసిన బాధ్యత మనకుంది. 

ఇక్కడ ఎవ్వరూ కూడా పాపులుగా రాలేదిక్కడ. ఇక్కడకు వచ్చిన వాళ్ళందరూ కూడా మూలము/కేంద్రము నుంచి వచ్చిన వాళ్ళమే. కేంద్రములో ఏర్పడిన కదలిక నుంచి వచ్చిన వాళ్ళమే. ఆ కేంద్ర ప్రాంతం నుంచి మనమందరం కూడా సృష్టి లో బయట పడ్డ వాళ్ళమే. సృష్టి లోవచ్చిన వాళ్ళు యిలా దు:ఖములో వున్నారేమిటి? అన్న ఒక భావనతో, కృష్ణపరమాత్మ వచ్చి యింత చెప్పేసిపోయినా కానీ వినటంలేదు కదా అనే ఒక ఆవేదనా భావము తోజరిగింది ఏమిటంటే కొంతమంది సాధుపుంగవులు బాగా  ప్రార్థన చేశారు. దానిలో చాలా ప్రముఖులు లాలాజీ మహరాజ్ గారు. లాలాజీ మహరాజ్ గారు అదేపనిగా పెట్టుకొని దీన్నించి ఎట్ల తీయాల వీళ్ళని ఈ బాధ నుంచి, దీనికి ఒక మనిషి కావాలి కదా! అనే వుద్దేశ్యంతో చాలా ప్రయత్నం చేసి ప్రకృతికి  ప్రార్ధన చేసి, ఆ ప్రకృతి చేత, మూల కేంద్రం చేత, మనకందరికి అనుగ్రహం ప్రాప్తించేటట్టు కోరుకున్నారు. దానివల్ల జరిగింది ఏమిటంటే, కేంద్రమే పరిధి వైపు విస్తరిస్తున్నది (centre is yawning towards circumference) ఇన్ని రోజులు మనము పరిధి(Circumference) నుంచి కేంద్రము(centre)నకు పోవాలనే ప్రయత్నంతో వున్నాము. కేంద్రమే మన గూర్చి పట్టించుకొనేటట్టు చేయగలిగిన మహా వ్యక్తి ఆయన. అదే ప్రాణాహుతి అనే ముఖ్యసూత్రానికి (principle of pranahuti)  మొదలు. ఎందుకంటే మనం ఆయన దగ్గరకి పోవడం అనేది మన సంకల్పబలము. కేంద్రము కూడా మనల్ని తీసుకోవాలి, వీళ్ళని సరి అయిన పద్ధతిలోనికి తీసుకురావాలి అనే సంకల్పము అక్కడ కలుగజేయడము అనేది వుంది చూసారా, అది కేంద్రప్రాంతము నందు తీసుకువచ్చిన మార్పు. ఆ మార్పుకి ఆది ఆయనే.  ప్రాణాహుతికి ఆది యిదే.  ఆ సంకల్పబలము ఎవరికైనాకానీ, మీకైనా కానీ, నాకైనా కానీ, ఎవరికైనాగానీ ఒక స్థితి కలిగి యితరులకు సహాయం చేయగలిగి నపుడు  ఆ మనస్సు ఎదిగినపుడు దానికి తోడ్పాటు అనేది వుంది చూసారా, అది తనకు తానుగా వచ్చు తోడ్పాటు, ఆ సంకల్పశక్తికి వుంది. 

కేంద్రము అధికార పూర్వక ఆజ్ఞ ఏమనగా ప్రతిఒక్కరూ దగ్గరగా వుండాలని, కలిసిమెలిసి వుండాలని, త్యాగభావముతో తోడునీడగా కలిసి జీవించాలని.  అందరూ కలిసి మెలిసి వుండాలని కేంద్రంకోరుకుంటున్నది. మనము ఈవిధముగా మార్పు చెందాలనేది భగవంతుని యిచ్చ. అంటే ఈ యుగానికి కావలసినటువంటి మార్పు వుంది చూసారా, కలియుగంలో జరగవలసిన మార్పుకి కాస్తంత అడ్డు. ఎందుకంటే నా లెక్కప్రకారం, మన యొక్క పూర్వీకుల లెక్కప్రకారం, నాకు ఈ ఉదయం స్మృతికి వచ్చిన ఊహ ప్రకారము కూడా, (out of memory, this morning also,) 4,32,00,000 (నాలుగు కోట్ల ముప్పది రెండు లక్షలు) సంవత్సరముల పాటు కలియుగము నడుస్తుంది.  అలా లెక్కెట్టు కుంటే,  యిప్పుడే యింత చండాలంగా అయిపోతే ఆ తర్వాత యుగాంతంలో ఎట్లా వుంటుందన్న ఒక భావన ఏదైనా వుందేమో నాకు తెలీదు. అటువంటిదేదైనా లాలాజీగారి మనస్సులో వుండిపోయిందేమో నాకు తెలీదు. నాకైతే ఇది ఊహ మాత్రమే. నేను మీతో మాటలాడినదంతా ఊహాజనితమైనదే. కానీ, అలాంటిదే ఒక విషయం పూజ్య లాలాజీ గారిని ఆలోచింప జేసింది.  ఆయన ఎందుకనో అనుకొన్నాడు యిది, ఈ పరిస్థితి మరీ దరిద్రంగా వుంది, దీన్ని బాగుపరచాలి. ఎట్లాగైనా భగవదనుగ్రహము అందరి పైనా పడేటట్లు చూడాలి, అనే ఒక పెద్ద ఋషితుల్యమైన, అంతకంటే గొప్పవ్యక్తి యొక్క మనస్సు భావంతో. ఎందుకంటే ఒక వ్యక్తి తన గురించి ఆలోచించవచ్చు, నలుగురి గురించి ఆలోచించవచ్చు, కానీ విశ్వవ్యాప్తంగా అందరు మానవులు కూడా భగవత్ ప్రేమకి, భగవంతుడి వైపు మరలడానికి ప్రయత్నం చేయాలి అనేసి ఒక ఆలోచన  రావడమే చాలా గొప్ప విషయం. 

అటువంటివి మనకు కూడా వస్తుంటాయి అప్పుడప్పుడు. మనం కూడా అనొచ్చు, నాకు కూడా అనిపిస్తుందని. అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఎల్లప్పుడూ అనిపిస్తుందా, అనేదే ముఖ్యం.  ఎల్లప్పుడూ అనిపించినవాడు ఆ స్థితిలో వున్నట్లు. అప్పుడప్పుడు అనిపించినవాడు, అప్పుడప్పుడు కాస్త బాహ్య ప్రభావం వచ్చినట్లు, గాలి సోకినట్లు.  ఎప్పుడూ అదే స్థితిలో వుండి, తర్వాత దాన్ని తీసుకురావడం. కావాలి అనేది ఒకటి,  తీసుకురాగలగడం అనేది ఇంకోటి. తీసుకురాగలిగినపుడు జరిగింది ఏమిటంటే ఉపనిషత్తులో చెప్పినట్టు, ప్రాణస్యప్రాణః అని ఒకటుంది. అన్నిటికి ఆదిమూలం ఏమిటి? ఇక్కడున్న ప్రాణాలన్నిటికి ఆదిమూలము ఏమిటి? ఈ ప్రాణాల వెనుక ఒక ప్రాణముందయ్యా అన్నారు. 

మీ కెవరికైనా ఆసక్తి వుంటే, ప్రశ్నోపనిషత్తు కానీ, కేనోపనిషత్తు కానీ చదివితే ఈ కధలు వుంటాయి. మీరు ఆ విషయం చూడొచ్చు. దాంట్లో ఏమిటి? ఒక యక్షుడు కనపడతాడు. ఎవరికి? ఇంద్రాదులకి. వాళ్ళేదో గెలిచి వస్తారు. రాక్షసులను గెలిచి వస్తారు. మేమే గెలిచేసి వచ్చినామని, అలా వచ్చినపుడు ఆ విజయోత్సాహంతో వాళ్ళు గెంతుతూ వుంటే ఒక యక్షుడు కనపడతాడు వాళ్ళకి.  నువ్వు ఎవడయ్యా? నువ్వు కొత్తగా వున్నావే అంటారు వీళ్ళు. అడిగితే తెలుసుకో నీవే అంటాడు. నీవే తెలుసుకో నేనెవరో? నేను ఇది చేయగలను. నువ్వు చెప్పు నీవెవరివో? నేను అగ్నిని అన్నిటినీ కాల్చి వేస్తాను. ఏదైనా కాల్చివేయ గలుగుతాను. ఆహా అట్లాగా! ఏదీ ఈ తృణాన్ని కాల్చు అంటాడు. అగ్ని ప్రయత్నం చేస్తాడు. అది కాలదు. అట్లాగే తర్వాత వాయువు వస్తాడు. నేను దేన్నైనా ఊపేస్తాను ఈ ప్రపంచంలో అంటాడు. అట్లాగా! దీన్ని ఊపు అంటాడు. అతడు ఊపలేక పోతాడు. అట్లాగే వరుణుడు వస్తాడు. దేన్నైనా తడిపేస్తాను అని. దీన్ని తడుపు అంటాడు. ఈ మూడు పరీక్షలు అయిపోవడం తోటే ఇంద్రుడికి జ్ఞానోదయం కలిగి వీడేదో  కాడు. ఇది పరమాత్మ అని మనకు వచ్చింది యిక్కడ కనపడి చెబ్తున్నాడు పాఠం. ఇది గ్రహింపులేకుండా అయిపోయి నేను, మనమంతా కూడా మనం చేసుకొన్నాం అనుకొన్నాము బుధ్ధిలేకుండా పోయి కాళ్ళ మీద పడదాం రండి అనేసి పోయి పరమాత్మ కాళ్ళ మీద పడతారన్నది కధ. 

అక్కడ కేనేషితం పతతి? కేనోపనిషత్తులో దేనివల్ల బ్రతుకుతున్నావు? ఆ ప్రశ్నవచ్చినపుడు ప్రాణస్య ప్రాణ: నీవెవరు అంటే? ప్రాణానికే ప్రాణము అంటాడు.

కానీ మన సాంప్రదాయంలో యదార్ధముగా వుండేది ఆప్తవచనమే. శృతి ఆప్తవచనమే. పెద్దవాళ్ళు చెప్పినారు. ఎందుకు చెప్పినారు? మంచికే చెప్పినారు. చెడిపోవాలని ఎవడూ చెప్పలేదు. అందువలన  ఆ వుద్దేశ్యంతో మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకు చెబ్తున్నాము మేము అంటే? ఆప్తవచనం కిందే. మీరు వచ్చినారు కాబట్టి మీరు మాకు ఆప్తులే. మేము చెప్పుతూ వుంటాం. ఎందుకు చెప్పుతూ వుంటాం? మాకు వేరే వుద్దేశ్యమేముంది ఇక్కడ? వేరే వుద్దేశ్యం లేదు. 

ఇది మీరు అర్థం చేసుకొంటే దీనికి ఒక ప్రయత్నము చేస్తామని మొదలెడుతారు తర్వాత. ఆ తర్వాత నిజమైన ఆప్తుడు పలుకుతాడు. ప్రపంచం లో అందరికీ ఆప్తుడు ఒక్కడే. లోపల ఉన్నాడు వాడే. ఇంకెవరూ లేరు. నా చిన్నప్పటి కథ ఒకటుంది. Gopal the friend అని. నేను జన్మలో మర్చిపోను ఆ కధని. 

ఒకచిన్న కుర్రాడు చదువుకోవాలి. వాళ్ళ ఊళ్ళో బడి లేదు. చదువు కోవాలంటే మరి అమ్మ వేరే వూరి బడిలో చేర్పించింది. అడవి దాటితే బడి. అక్కడ చేర్పించింది. అడవిని దాటాలంటే ప్రతిదినము తోడుగా పోయి రాలేదు.  ఎందుకంటే ఇక్కడ ఉద్యోగం పోతే , పైసలుండవు భోంచేయడానికి. నువ్వు పో అంటుంది. అడవిలో నాకు ఎవరూ తోడు వుండరు కదా! భయం వేస్తుంది కదా అంటాడు. గోపాలుడు ఉంటాడు, పిలువు  వాడిని అంది తల్లి. వాడు గోపాలుడిని పిలిచాడు. పలికాడు గోపాలుడు. దినమూ వచ్చేవాడట. ఇక్కడ్నుంచి అడవిలో మొదటి నుండి ఆ చివరి దాకా తీసుకు పోయి వదిలేవాడట. ఒరే చాలా ధైర్యంగా వస్తున్నావు ఏమిటిరా? అంటే. నా స్నేహితుడు నాకు తోడు వస్తున్నాడు కదా అన్నాడు. ఎవరా స్నేహితుడు?  అని అడిగితే, నాకు  చెప్పావు కదా గోపాలుడు పిలిస్తే వస్తాడు కదా అన్నాడు. వాళ్ళందరూ కట్టకట్టుకొని పోయినారట చూద్దామని. కానీ వాళ్ళకు కనపడలేదు. నిస్వార్థంగా మనం చూస్తే, నిష్కల్మషంగా మనం ఆలోచిస్తే భగవంతుడు ఎప్పుడూ పలుకుతాడు. ఆ మితృడు (భగవంతుడు) ఎల్లప్పుడూ కూడానే వుంటాడు. పిలిచేదానిపైన మన బుధ్ధిపైన వుంటుంది. నిష్కల్మషంగా పిలిస్తే తప్పకుండా పలుకుతాడు. తోడ్పాటు చేసేవాళ్ళు చాలామంది వుంటారు. 

ఈ ప్రాణాహుతి అనేది ఈ పద్ధతి యొక్క విశిష్టత. గురువు సహాయము అనేది మీకు వుంది. ఎవరి ద్వారా వుంది.? మీకు సహోదరుడి ద్వారా వుంటుంది లేక సహోదరి ద్వారా వుంటుంది. మరి వాళ్ళు చేస్తారా ఈ పని. వాళ్ళు చేసేట్టు వుంటే ఈ దేశం  ఎప్పుడో బాగుపడి పోయివుండేది. వీళ్ళెవరూ చేసేవాళ్ళు కాదు. చేసేవారు ఆయనే. భగవంతుడే చేసుకొంటాడు ఆ పనిని. ఎందుకు చేసుకొంటాడు? మనం అందరం బాగుపడాలని. మనమంతా సంతోషంగా ఉండాలని. ఆనందంగా ఉండాలని.    మనం ఎల్లప్పుడూ ఆనందంగా ఉండేలా జీవించాలి. ప్రాపంచిక సుఖము (Pleasure) ఆనందము కాదు. ఈ రోజుల్లో జరిగేది ఏమిటంటే ప్రతి ఒక్కరూ ప్రాపంచిక / దైహిక సుఖాల వెంబడి పరుగులు తీస్తున్నారు.  అట్టి సుఖాలలో ఆనందం అనేది రాదు. రోగాలు వస్తాయి. అసలైన ఆనందంలో రోగాలు రావు. సంతోషం వస్తుంది. నీవు ఆనందంగా వుండగలిగితే ఇతరులను కూడా ఆనందపరచ గలవు.  ఆనందము అనేది ఒకరినుంచి మరొకరికి సంక్రమిస్తుంది. ప్రాపంచిక సుఖము కూడా ఒకరినుంచి మరొకరికి సంక్రమిస్తుంది.  ప్రాపంచిక సుఖము రోగముల రూపంలో సంక్రమిస్తుంది.        కాని నిజమైన ఆనందము ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. మంచి ఆరోగ్యము. అన్ని విధములుగా శారీరక ఆరోగ్యము కలిగిస్తుంది. అది ఆరోగ్యమును కలిగించే ఆనందము. వేరొకటి అనారోగ్యమును కలిగించే ఆనందము. అదే ప్రాపంచిక సుఖాలకు నిజమైన ఆనందానికి వుండే తేడా.

ప్రాణాహుతి అనునది మనకు లభించు  ఒక సహాయము. మీరు శరణాగతి స్థితిలో ఉన్నారా లేదా అనే విచక్షణ అక్కడ వుండదు.  మీరు ప్రాణాహుతి పొందడానికి శరణాగతి స్థితిలో ఉండవలసిన పని లేదు.  ప్రాణాహుతి, భగవంతుడు సంకల్పించి కలిగించే సహాయము. 

శరణం అనేసరికి రెండు చెప్తాం చూడండి. శరణం లో అతి ముఖ్యమగు విషయము, ఎలాగో నా దృష్టి కి తెచ్చారు. 

సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వ భూతేభ్యో దదామి ఏతద్ వ్రతం మమ

ఇది రామాయణం లో రాముడు విభీషణుడు శరణాగతి పొందిన తర్వాత ఎందుకయ్యా యిట్లా చేస్తున్నావు? ఎవరికి పడితే వారికి సహాయం చేస్తునావు? వాడు శతృవుల శిబిరం నుంచి వచ్చాడు కదా !వాడికి ఎట్లా చేస్తావు నువ్వు? అని అడిగినపుడు ఈ మాట అంటాడు.

సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే !

నా మనిషి అని ఎవరైనా వచ్చి కాళ్ళ మీద పడితే

సర్వ భూతేభ్యో రక్ష ఇష్యామి !

అన్ని భూతముల నుండి రక్షణ కలిగిస్తాను.

ఇక్కడ లక్ష్యము  ఏమిటంటే భూతములపైన. ఎవరి నుండి మనకు రక్షణ యిస్తున్నాడు ఈ శరణాగతిలో అంటే, భూతములనుంచి రక్షణ. భూతములనడంతోటే యిక్కడేదో మనకు పిశాచములు, భూతాలు కాదు కదా.

భూతములు అంటే పంచభూతములు అనగా భూమి, జలము, అగ్ని, వాయువు, మరియు ఆకాశము(ether).

ఈ 5 (పంచ) తత్వముల నుంచి,  పంచభూతముల నుంచి, మనకు ఉపశమనము యిస్తానంటాడు. అంటే ఏమిటి అక్కడ రాక్షసుడు దుర్మార్గుడు.  వాడు చెప్పింది నేను వినటంలేదు. నన్ను చంపేస్తున్నాడు. తప్పు చేయమంటున్నాడు. అధర్మం ఎట్లా చేయాల నేను. నా వల్ల కాదయ్యా! నీవే కాపాడాలి నన్ను అంటాడు. అంటే పంచభూతముల నుంచి కాపాడమని అతను ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే రావణబ్రహ్మ పంచభూతములను అదుపు చేసేవాడు. పంచభూతముల పైన ఆధిపత్యము ఆయనకుంది. కాబట్టి  అతన్ని ఎదుర్కొనడం చేయాలంటే నువ్వు వాటి నుంచి కలిగే కష్టాలను, దు:ఖాలను తట్టుకొనే స్థితి కావాలి. ఆ స్థితి నేను ఇస్తాను అంటాడు. ఇదీ ఆసందర్భాన్ని అర్ధం చేసుకుంటే తెలిసేది.

ఎక్కడ చెప్పారు? వేదాంతపరంగా దాన్ని వెయ్యి రకాలుగా చెప్పింది వేరే సందర్భములో దాన్ని అధ్యయనం చేస్తే. ఇక్కడికి వచ్చేసరికి ఆ  విషయం వేరే. 

కృష్ణపరమాత్మ దగ్గరికి వచ్చేసరికి

సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ!

అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ:!

ఇక్కడ పాపముల బారినుండి నేను కాపాడుతాను అంటాడు. అక్కడేమో భూతముల బారి నుంచి నిన్ను కాపాడుతాను అంటాడు. ఇక్కడ పాపముల బారినుంచి మాట్లాడుతున్నాడు. ఎక్కడా కూడా వీళ్ళిద్దరూ మోక్షము ఇస్తామని చెప్పలేదు. పాపముల నుంచి మోక్షమిస్తాము. భూతముల నుంచి మోక్షమిస్తాము, రక్షణ యిస్తాను అంటున్నాడే కానీ,  దీనికి వేదాంతాదులు యిచ్చిన వివరణలలోఅత్యున్నత స్థితి యిచ్చేస్తామన్న ఉవాచ భగవంతుడి నోటి నుండి రాలేదు. ఇతరుల నోటినుంచి చాలావచ్చాయి. దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఒకరిని విమర్శనము  చేయడం నామతం కాదు.  అది వున్నది వున్నట్లు సరిగా గ్రహించడము మంచిది. (Better understand what it is ?). ఇవి తీసుకున్నప్పుడు రెండు శరణత్వాల్లో యివే మిగిలినాయి. వీటిలో ఎక్కువగా శరణాగతిని మనం లక్ష్యముగా చేసాము..

శరణాగతివేదం అనే పేరు పెట్టాము రామాయణానికి. రామాయణం చదువు కొన్నప్పుడు శరణాగతి పూర్తిగా నీకు అర్థం అవుతుంది. కాకాసుర వృత్తాంతం మనం తెలియపరుస్తాము. అక్కడా భూతముల నుంచే రక్షణ ఇచ్చాడు. ఏ భూతము ? తన యొక్క అస్త్రము నుంచే. తన అస్త్రము నుంచి ఉపశమనము ఇచ్చినాడు కానీ కాకాసురుడికి వేరే ఉపశమనము వచ్చింది లేదక్కడ.  కానీ నిర్దయతో ఏదీ పరిగణంలోకి  తీసుకోకుండా చంపేసాడు కృష్ణుడు.  ఎవ్వరిని విడువలేదు. ఎందుకు? అతను వచ్చిందే అందుకొరకు. నేను వచ్చిందే ధర్మసంస్థాపనార్ధాయ అని. అటువంటివాడు సర్వ ధర్మాన్ పరిత్యజ్య అన్నాడు. ఏది అయితే ధర్మసంస్థాపనార్ధాయ నేను వచ్చినానని చెప్పినాడో, ఎప్పటివరకు అది?

శిశుపాలుడి వధతో అయిపోయింది కృష్ణావతారం కథ. ఆ తర్వాత కృష్ణుడు ఒక క్షత్రియ వీరుడిగా పనిచేసాడు.  అవతారముగా పనిచేయుట శిశుపాలుడి వధతో అయిపోయింది. రాక్షస సంహారం అక్కడ అయిపోయింది. శిశుపాల, దంతవక్తృలతో ఆయన అవతారం యొక్క లక్ష్యము పూర్తి అయింది. తర్వాత యింకనూ వుండి చేసాడు. ఎందుకు? ధర్మసంస్థాపనార్ధాయ వచ్చినానని అంటాడు. ఈ ధర్మసంస్థాపనకి వచ్చినపుడు ధర్మాన్ని గూర్చి కొట్లాడు అంటాడు. ధర్మము పాటించు అంటాడు.

చివరగా నాకేమి అర్థం కావడం లేదంటే సర్వ ధర్మాన్ పరిత్యజ్య అన్నాడు. అంటే అర్జునిడిది ఒక క్షిప్తమైన మనస్సు.  ఇప్పుడు ఈ పరిస్థితిలో నీవేమి చేయలేవు. నేను చెప్పింది వినరా వెధవా అన్నాడు. నీ ధర్మం అంతా వద్దు. దీని గూర్చి మాట్లాడవద్దు. మర్చిపో. నేను చెప్పిందే ధర్మము అంటాడు. అంటే దేవుడు చెప్పిందే ధర్మము అనే ఒక పాఠము చెప్పాడు. 

రెండిట్లో కూడా మీకు కనపడేది ఏమిటంటే భగవత్ తత్వములో, ఎవరికి వాళ్ళు వాళ్ళ  కార్యం చేస్తున్నారు. ఇక్కడ తాను సహాయం చేస్తానని ఎక్కడ వుంది? నీ సాధన లో తోడ్పడతానని ఎక్కడ చెప్పాడు? శరణాగతి అంటే కాళ్ళమీద పడి ఒప్పుకోవాలి. యధార్ధానికి శరణాగతి లేనిదే ఆధ్యాత్మిక పురోగతి రాదు, నిజమే. అది ఒక స్థితి. అది రావాలి. శరణాగతి అనేది ఒక స్థితి, ప్రపన్నత్వము అనేది ఒక  స్థితి.  దీన్లో అనేక ఛాయలు వున్నాయి. 

శరణాగతి అనేది మొదట్లో. ఇప్పుడు గయుడూ శరణాగతుడే. ఎవరైనా కానీ ముందు పోయి  కాళ్లమీద పడిపోతాము. పడిపోయినపుడు ఏమని  అడుగుతాము? నాకు ఈ భూతముల నుండి రక్షించు, ఈ పాపముల నుండి రక్షించు అని అంటాం. విన్నపము చేస్తాము ఒక చిన్న విన్నపముతో మనం ప్రారంభము చేస్తాము. కానీ ఆధ్యాత్మిక విషయంలో విన్నపాలు అంటూ ఏమీ వుండవు. ఎందుకంటే కర్మాన్ని నేను అనుభవిస్తాను అంటారు. నా కర్మఫలాన్ని నేను అనుభవిస్తాను. అందుకు కావలసిన ఆత్మ స్థైర్యం నాకు వుంది. దానిని నేను చేసుకొన్నాను కాబట్టి నేనే అనుభవిస్తాను. కానీ నిన్ను మాత్రము మర్చిపోనీకుండా చెయ్యిరా నాయనా అంటాము. ఇక్కడ ఫలాపేక్షతో శరణత్వం చేరడం లేదు. శరణాగతుడు సాధారణంగా ఫలాపేక్షతో చేస్తాడు. అందువలన శరణాగతి అన్నది ఫలాపేక్షతో చేసినపుడు అది శరణాగతి కిందకు రాదు. అది నిజమైన  శరణాగతి కాదు. అందుకనే  అటువంటి స్థితిని ప్రపన్నత్వము అంటాము. మొదట్లో చేసే శరణాగతి ఫలాపేక్ష తో చేసింది. ఇదొక మానసిక స్థితి. ఎప్పుడైతే సదసత్ వివేకం కలుగుతుందో మనకు, అది కలిగి ఆత్మ స్వరూపం అనేది మన మనస్సుకు ఏర్పడుతుందో, ఆ ఆత్మ స్వరూపం అనేది భగవత్ తత్వం పైన ఆధారపడి వుంటుందనే జ్ఞానం కలుగుతుందో, ఆ జ్ఞానం కలిగిననాడు భక్తి కలుగుతుంది. భక్తి కలిగినపుడు  ఎటువంటి చిన్న ఒడిదుడుకులున్నా నీవేతప్ప ఇహః పరంబులు లేవు అనేసి మరి ఆ ఏనుగు రాజు నుంచి, ఈ రోజు మనం, మూషిక రాజుల దాకా అందరూ పాడుతూనే వున్నాము. నిజమే. అదేమో ఈ జీవితమేమైనా శాశ్వతమా, పోనీ. నా ఆత్మ ఏమైనా శాశ్వతమా, పోనీ. నా భక్తి ఏమైనా శాశ్వతమా, పోనీ.  నువ్వు కావాలి. భక్తి కూడా నాకు అక్కర లేదు. నీవు కావాలి . ఇటువంటి ఒక మనస్సు వచ్చినపుడు పెద్ద పెద్ద సాధువులు కూడా వాళ్ళేమన్నారు ? తిరిగి తిరిగి నేను పుడతానన్నారు ఈ భూమిపైన.  .ఎందుకు ? నీ గొప్పతనము చెప్పడానికని. వేరే ఉద్దేశ్యం కాదు. నీ గొప్పతనము చెప్పడానికి నాకు పలు జన్మలు కావాలన్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ జన్మరాహిత్యం కోరుకొనేవాడు ఇటువంటి దానికి కూడా లొంగువాడు  కాడు. 

అందుకనే బాబూజీ పుస్తకం సత్యోదయములో మాట్లాడినపుడు నాకు అర్థంకాదు, వీళ్ళెందుకు పలుసార్లు పుట్టాలంటారు, తిరిగి భగవంతుడి గూర్చి చెప్పడానికి, నాకు అర్థం కాదు అంటారు ఆయన. ఒక విధంగా చెప్పాలంటే, వ్యంగ్యంగా చెప్పేసి వెళ్ళి పోయారు  బాబూజీగారు. కానీ నిజంగా మనకేమిటంటే మనకు తిరిగి పుట్టాలని అనిపిస్తుంది. అది ఒక మానసిక స్థితి. భక్తిలో వున్నవాడు తిరిగి తిరిగి వస్తానంటాడు. భక్తి నుంచి ఎదిగిన వాడు శరణాగతుడు అయిపోయి నీవే తప్ప నాకెవరూ లేరయా గతి అంటాడు. కానీ దీని ఉన్నత స్థితియే  ఆధ్యాత్మిక సాధన అంతాకూడా. శరణాగతి యొక్క ఉన్నతస్థితి. ఈ శరణాగత తత్వం నుండి మారిన వాడేమో ప్రపన్నుడవుతాడు. 

అయితే అక్కడితో అయిపోయిందా? లేదు కదా! అక్కడ ప్రపన్నత్వం వచ్చిన తర్వాత తిరిగి సమస్య వచ్చింది. ఎప్పుడైతే నేను శరణం పొందినానో, ఆయన ఇంట్లో నేను చేరిపోయానో, ఈయన వస్తాడు. ఏం కావాలి ? మనం అడగం ఆయన ప్రశ్నని. అంటే ఆయన్ని చూడాలని వచ్చాం.

ఆయనతో నీకేమి పని? నేను చేస్తాను కదా ! నేను చేస్తానని చెప్పడం. ఆయనకిప్పుడు వీలుపడదని అని అడ్డు పడడం.  ఈ పుణ్యాత్ముడు కాస్త సనకసనందనాదుల స్థితిలో వున్నాడనుకో నన్ను శపించేసి వెళ్ళిపోతాడు. తిరిగి నేను రాక్షసుడిగా పుడుతానిక్కడ. ప్రపన్నుడైన వాడే రాక్షసుడయ్యేది.  క్రింద పడ్డాడు.  జరిగిందిది.

శరణాగతి దాటిన తర్వాత కూడా చాలా వుంది. చాలా స్థితులు వున్నాయి. ఆస్ధాయి లో కూడా నీకు ఆలంబన కావాలి. పట్టు కావాలంటే గురువు సహాయం తప్పదు.   గురువు నుండి ప్రసారితమయ్యే శక్తి కావాలి. లేకపోతే  మనము పట్టును కోల్పోతాము. మన యొక్క బరువు ఎక్కువయిపోతుంది. మనయొక్క అహంకారం అక్కడ కూడా వస్తుందా అంటే మొట్టమొదటి ఆధ్యాత్మిక సాహిత్యంలో అహంకారం అనేది మొదటి మెట్టు. అహంకారం తగ్గించుకోవాలని చెప్పిన వాళ్ళు మనకుంటే, ఈయన అంటాడు అహంకారం అనేది అత్యున్నత స్థితి దాకా వెళ్ళుతుంది. కాకపోతే పరిశుద్ధము అవుతూ వుంటుంది. ఈ అహంకారం అనేది నేను, అహము అన్న భావము ఉంటుంది కాబట్టి, అది ఉన్నంత సేపు నీ బరువు ఉన్నది నాయనా, అది పోవాలి.  ఎప్పుడు పోతుంది? అహంభావం కూడా పోవాలి. అహము అనే భావన  కూడా పోవాలి. ఆ గుర్తింపు వుంటుంది. అది పరిపూర్ణంగా పోతుందా? పరిపూర్ణంగా పోదయ్యా. ఎందుకంటే సృష్టితో నీవు వచ్చావు కదా! సృష్టితో అణువు (వచ్చింది) బయటపడింది. ఆ అణువు కడపటి దాకా వుంటుంది అపరిమితమైన దుమ్మును పోగు చేసుకొని, ఈ మాలిన్యము లతో వున్నాము. మాలిన్యములను వదులు కొని ధూళికింద మారవచ్చు. కానీ ఆ ధూళిని తప్పకుండా గురువుకు అర్పితము చేయాలి ఆ స్థాయికి చేరిన మానసిక స్ధితిలో మీరు మాట్లాడితే, అది శరణత్వము, నిజమైన శరణత్వము.

అందుకనే ఈ ప్రార్థన లో ఓ ప్రభూ!అనేసేసి కడపటి రెండు వాక్యములు

ఆ స్థితికి మమ్ము కొనిపోవుటకు

నీవే ఏకైక దైవము మరియు శక్తివి

అనేది వుంది చూసారా !

ఆ ప్రార్ధనయే నూతన సాధకునకు మరియు చిట్టచివరి స్థితికి చేరిన వ్యక్తికి కూడా వర్తించు ప్రార్ధన, మరియు అదే ప్రార్ధనను నా గురువు చివరి వరకు ఆచరించి చూపారు. ఎందుకు?

ఆయన ఎల్లప్పుడూ తన గురువునే ఆరాధిస్తూ వుండేవారు.

ఎంతఎక్కువ కాలము నీవు నీ గురువును మరువకుండా వుండగలుగుదువో, అప్పుడు నీ తక్కువతనము (అణకువ, వినయములు) ను చివరివరకూ కొనసాగించగలవు.

ఎప్పుడైతే గురువుని మర్చిపోయి, నేను ఆయనతో సమానము అనుకొన్నాడో, అప్పుడు, వీడి అహంకారం పెరుగుతుంది. సహజంగానే ఆ అహంకారము వలన కొంత భారము కలుగుతుంది. (Naturally some weight comes.) భారము పెరగగానే క్రిందపడడం తప్పదు. ఇవన్నీ ప్రతిఫలముగా జరిగే విషయాలు. ఆధ్యాత్మిక విషయంలో ఏ మాత్రం బరువు  మనం అంటించుకొన్నా క్రిందపడుతూనే వుంటాం. క్రిందపడడం, లేవడం అనేవి సాధనలో సాధారణంగా సహజం. అది చేస్తే తెలుస్తుంది దాని బాధ ఏమిటో. దాని రంగస్థలము  వేరే. శరణత్వం అనునది ఒక తత్వశాస్త్రము .మనకది  తెలియ చేయడు. భగవత్ తత్వాన్ని గూర్చి తెలియ చెసేటప్పుడు శరణత్వం గూర్చి మాట్లాడతాడు. ఇక్కడ తోడ్పాటు వుంది. అది నిజమైన / వాస్తవమైన సహాయము. ఆయన నీతోనే వున్నాడు.

ప్రాణాహుతి మరియు శరణాగతి అనునవి వేరు వేరు విషయములు. శరణాగతి అనునది చాలా పురాతనమైనది.  కాని నీవు భగవంతుని సహాయమును గూర్చి అడిగితే అది ఎల్లప్పుడూ వున్నదే. ఆ సహాయమును అందరికీ అందుబాటులోనికి తీసుకురావడమే ఈ విధానము యొక్క గొప్పదనము. దీనిలో ఆ సహయమును అందరి దగ్గరికి చేర్చగలిగే సామర్ధ్యముగలవారు అనేకమంది ఉన్నారు. అందరికీ తోడ్పడటానికి అవకాశం అనేది కల్పించడం. 

ఇంతకు ముందు భగవంతుడి తోడ్పాటు లేనిదే పైకి పోయిన వాడు ఎవడూ లేడు. శరణత్వం లేనిదే భగవంతుని పొందినవాడు లేడు. ఉండజాలరు.  అలా జరిగే ప్రశ్నయే లేదు. జరగదు. నేను ఎంపిక చేసిన వాడే నాదగ్గరకు వస్తాడు అంటాడు కృష్ణపరమాత్మ మాటలలో.  నేను ఎవరైతే కావాలనుకొంటానో వాడే వస్తాడు అంటాడు. ఇక్కడ ఈయన (గురువు) ఏమంటాడు అంటే మీ అందరి కొరకు నేనే  కేంద్రమును ప్రార్ధించాను.  ఆయన అందరిని రమ్మని అడిగాడు. అదే పిలుపు.  అవతారముల విషయములో అది వారి యిచ్చాపూర్వకము.  ఇక్కడ అది సంపూర్ణ విశ్వమునకు సంభందించినది. గతములో దైవము సంకల్పించినపుడు మాత్రమే ఏ ఒకరికో లభించు దర్శనమునకు బదులు,  దైవత్వము లేక కేంద్రము, పరిధి వైపుకు ప్రయాణించుట అనేది విశ్వములో నేడు జరుగుతున్న అద్భుతమైన ఘటన.

నాలుగు రకాల భక్తులుంటారు.  వాళ్ళకు కావసినవి వాళ్ళకిస్తూ వుంటాను. ముముక్షులు చాలామంది వుంటారు. వాళ్ళలో జ్ఞానవంతుడు ఎవడు ?

బహూనాం జన్మనాంమంతె జ్ఞానవాన్ మాం ప్రపద్యతే !

 అనేక జన్మల తర్వాత బుధ్ధివున్నవాడు నా కాళ్ళ మీద పడతాడు అని. అంటే అన్ని జన్మల్లో వాడికి బుధ్ధి లేదా అంటే అలానే అనుకోవాలి. కొంత కొంతగా పెరిగింది. సంపూర్ణ జ్ఞానం వచ్చింది. ఏమని? కాళ్ళ మీద పడిపోవాలని? అది శరణత్వం. అదే జరిగితే, కానీ ఆయన అలా పడిన వాళ్ళందరినీ తీసుకొంటారా అంటే,  నా యిష్టం అంటాడు. నేనెవరిని చూస్తే వాడే అంటాడు. అటువంటి ఒక కృష్ణపరమాత్మ, అటువంటి కృష్ణ తత్వమే చాలా గొప్ప తత్వము. అంటే అంత అవకాశము యిచ్చి, అంత కృష్ణ ప్రేమ గూర్చి మాట్లాడేవాళ్ళం కాదు.

కృష్ణ ప్రేమ కంటే కూడా విశ్వమయం  చేసారు. మనం ఏమి చెప్పుతూ వుంటాం? క్రిష్ణ ప్రేమ గోపికలకి పరిమితం చేసారు అంటాం. ఇక్కడ ప్రపంచంలోని వాళ్ళందరినీ కూడా గోపికా సమానులుగా తయారు చేస్తానని అంటారు ఈయన(గురువు).  దానికి తగినట్లుగా మనం తోడ్పాటు చేద్దాం  అంటాడు. ఒకరికొకరు సాయం చేసుకోండి అంటాడు. అది ఆయన స్వప్నము అంటే, శ్రీరామచంద్రజీ యొక్క గొప్పకల ఆ స్వప్నము, మనము అందరమూ పాలు పంచుకుంటే నిజము అవుతుంది. ఎవరైనా పాలు పంచుకోకున్నా, మిగిలిన మేరకు అది సాకారమవుతుంది.  పని ఆగదు కదా! భగవదేచ్చను మనం ఆపలేము కదా! మన కాలంలో కాకపోతే తర్వాత కాలంలో వస్తుందని అనుకుందాము.  అంతే.!

అందరికీ కృతజ్ఞతలు.