సంపాదకీయము
- 19.2 - 140 L.E. (2012)
|
పూజ్య బాబూజీ గారు మనలను భౌతికంగా వీడి 29 సంవత్సరములయినా
వారియునికి మనకు చేరువగానే వున్నట్లు సాధకులయనుభవము. నిరంతర
స్మరణ అలవాటు చేసుకొన్నవారికి పూజ్య బాబూజీ బహు సన్నిహితుడు.
అతని కరుణా కృపా విశేషాలను పొందిన ముక్తులు పలువురు. ఒక్కసారి
వారి అనుగ్రహ వీక్షణము కలిగినవారి హృదయము, బుద్ధి మరియు మనస్సు
నూతన మర్యాదలను పొంది తిరిగి వెనుపటి స్థితి సాధారణముగాపొందదు.
కాని దీనికి ముఖ్యముగా మనము పొందిన నూతన స్థితిని మన
ఆధ్యాత్మిక పురోగతికి సతతము ఉపయోగపడేట్లు జాగ్రత పడాలి.
పదే పదే నూతనముగా గురు కృప వలన నేర్చిన విద్యలను మననము,
అభ్యాసము చేయుటచే అవి స్థిర పడి పాతయలవట్లు, నడవడి
తొలగిపోతుంది.
లేనిచో మనము విషవలయములో తిరిగి ప్రయాణించక తప్పదు. కామం
సర్వదుష్ట గుణధామము క్రోధం గలవారు గురువధకైనా వెనకాడరు.
పాపానికి అధిష్టానము లోభం. అది పర ధన, దార వాంఛలకు మూలము.
అజ్ఞానానికి అది కారణము. ఇక మోహము, ఇది కాని పని అని తెలిసినా
కూడా చేయడము. తిరిగి పోవాలని తెలిసీ తిరిగి పోకపోవడము.
విడనాడాలని తెలిసీ విడవకపోవడము. ఇటువంటి దుర్గుణముల సమూహమే
మోహము. ఇక మదమంటే సముద్రాన్ని పుక్కలిస్తాననడము, హిమాలయాన్ని
పెళ్ళగిస్తాననడమూ, చుక్కలను దింపుతాననడమూ లాంటి మతి స్థిమితము
లేని మాటలననడము. ఇక మత్సరమంటే ఓర్వలేని తనము, అసూయ మొదలగు
మానసిక జాడ్యములు.
ప్రతి సాధకుడూ ప్రాణాహూతి పొంది గురువుగారితో మమేకం కాగలిగిన
వారే. ఆ అనుసంధానాన్ని సతతమూ స్మరించుకొంటూ వారి జన్మలను
సార్ధకం చేసుకోవాలనే మనందరి ధృఢ సంకల్పమూ, మన ప్రార్థనయూనూ.
తధాస్తు.
10-4-2012
కే.సి.నారాయణ |
|